'ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆపాలి'
నెల్లూరు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని, దీనిపై ఆ పార్టీలాడుతున్న డ్రామాలు ఆపాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నెల్లూరులో డీసీసీ ఆధ్వర్యంలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, దుగ్గరాజపట్నం పోర్టు సాధనపై మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. దీనికి విచ్చేసిన రఘువీరా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ తప్పేమీ లేదని, రాష్ట్రంలోని అన్నీ పార్టీలు విభజన చేయాలని చెప్పిన తరువాతే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టపోకుండా రూ.5 లక్షల కోట్ల పధకాలు, ప్యాకేజీలు, ప్రత్యేకహోదా అంశాలు చట్టంలో పొందుపర్చారని తెలిపారు.
అయితే ఈ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ వీటిని పట్టించుకోవడం లేదని, టీడీపీ కూడా బీజేపీపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని టీడీపీని తూర్పారబట్టారు. దీనిని నిరసిస్తూ ఈనెల 8వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మేనిఫెస్టోను తగలబెట్టడం, మానవహారాలు ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.