సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పాదయాత్రలో జగన్ వేస్తున్న ఒక్కో అడుగుపై జనం ఆశలు పెంచుకుంటున్నారు. తమను కష్టాల ఊబి నుంచి గట్టెక్కించే తీరం వైపు ఆ అడుగులు సాగుతున్నాయని వారు బలంగా నమ్ముతున్నారు. అందుకే రాజన్న బిడ్డకు ఎదురేగి మరీ స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు ఏఎన్‌ఎంలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, నిరుద్యోగులు.. ఇలా వివిధ వర్గాల వారు జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తయిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఈ జిల్లాల్లో అడుగడుగునా జనాభిమానం వెల్లువెత్తింది. ఇసుక వేస్తే రాలనంతగా బహిరంగ సభలు కిటకిటలాడాయి. ఈ సభల్లో జగన్ ప్రసంగం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఒక జిల్లాతో మరో జిల్లా పోటీపడుతోందా అన్నట్లు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర పాలకుల్లో గుబులు రేపింది. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఊరూరా జనకెరటం ఎగిసిపడింది. విజయవాడలో దుర్గమ్మ వారధి, ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న గోదావరి వంతెన ప్రకంపించేలా జగన్ వెంట జనం అడుగులో అడుగు వేసి మరో చరిత్ర సృష్టించారు.
కదిలిస్తే చాలు కన్నీళ్లే..
పింఛన్లు రావడం లేదని, ఇళ్లు లేవని, రేషన్‌కార్డులు లేవని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, పంటలకు గిట్టుబాటు ధర లేదని, రుణమాఫీ కాలేదని, ఇన్‌పుట్ సబ్సిడీ రాలేదని, నకిలీ విత్తనాలు వస్తున్నాయని వివిధ వర్గాల వారు, రైతులు జననేతకు నివేదించారు. తమ రుణాలు మాఫీ కాలేదని, బ్యాంకులు అప్పులు కట్టాలని ఒత్తిళ్లు తెస్తున్నాయని డ్వాక్రా మహిళలు వాపోయారు. అర్ధంతరంగా ఆగిన సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని రైతులు విన్నవించారు. అన్నా.. ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగమూరాలేదని నిరుద్యోగులు.. మమ్మల్ని నానా ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఉద్యోగులు.. వారి బాధను వెళ్లగక్కారు. తమ పరిస్థితి దీనంగా మారిందని పొగాకు, ఆక్వా రైతులు, కిడ్నీ బాధితులు, మత్స్యకారులు, చేనేతలు గోడువెళ్లబోసుకున్నారు. పండుటాకులపై ఇసుమంతైనా కనికరం లేకుండా జన్మభూమి కమిటీలు ఉన్న పింఛన్లను కూడా పీకేశాయని వృద్ధులు కన్నీటిపర్యంతమయ్యారు. జగన్ అందరి కష్టాలూ ఓపిగ్గా విన్నారు. వారి కన్నీళ్లు తుడిచారు. మనందరి ప్రభుత్వం వచ్చాక అందరి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా నవరత్నాల పథకాలతో ఆదుకుంటామని భరోసా ఇవ్వడం పేదలందరికీ ఊరట కలిగించింది. ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీసీని) రద్దు చేస్తానని స్పష్టీకరించడం వారిలో భరోసా కలిగించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇవ్వడం లక్షలాది కుటుంబాలకు ఊరట కలిగించింది.
తాడిత, పీడిత జనానికి కొండంత అండ
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దగాపడ్డ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు మనో బలాన్నిచ్చింది. తాను అధికారంలోకి రాగానే ఎవరికి ఏం చేసేది జగన్ స్పష్టంగా చెప్పారు. బీసీల అధ్యయనానికి ఓ కమిటీ వేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. పేద రైతులకు భూపంపిణీతో పాటు ఉచితంగా బోర్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. దళితుల భూములు లాక్కోకుండా చట్టం తెస్తామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ విధంగా ప్రయోజనం కలిగిందో అంతకన్నా రెండడుగులు ముందుకేసి అండగా ఉంటానన్నారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్, చట్ట సభల్లో అవకాశం కల్పిస్తామన్నారు. జగన్ భరోసా దళితుల్లో ఆశాకాంతులు నింపింది. బాధాతప్త గుండెలకు భరోసానిచ్చింది. ఆసరాలేని అవ్వాతాతలకు బతుకు తీపి పంచింది. యువత, నిరుద్యోగుల్లో కొత్త భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించింది. చదువుకునే విద్యార్థుల్లో మనోధైర్యం తీసుకొచ్చింది. కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నను వెన్నుతట్టి ప్రోత్సహించింది. గుండె చెదిరిన ప్రతి వ్యక్తికీ భవిష్యత్ బాగుంటుందనే నమ్మకం కలిగించింది. దీంతో అన్ని సామాజిక వర్గాలు ఆత్మీయ సదస్సులతో అభిమాన నేతను వెన్నంటాయి. మీరు అధికారంలోకి వస్తేనే కష్టాలన్నీ తీరతాయని ఆకాంక్షించారు.
పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం
జగన్ పాదయాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అది ఎంతగా అంటే ఇప్పడు ఎన్నికలు జరిగితే క్లీన్ స్వీప్ చేస్తామనేంత. ఊరూరా జనం ఎదురేగి.. తాము మరోసారి మోసపోమని, మీ వెంటే ఉంటామని జననేతకు భరోసా ఇస్తుండటం ఇందుకు నిదర్శనం. బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలకు స్వచ్ఛందంగా హాజరైన జనం, దారిపొడవునా అన్ని వర్గాల వారు కలిసి గోడు వెళ్లబోసుకోవడం, చంద్రబాబు పాలనలో నాలుగేళ్లుగా ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ఆయన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అందరినీ మోసం చేశారని జనమే జగన్‌కు చెబుతుండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యేలు యలమంచిలి రవి (విజయవాడ), బీవీ రమణమూర్తి రాజు (కన్నబాబు–విశాఖ), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కర్నూలు), మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు(కృష్ణా), ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌లతో పాటు వందలాది మంది నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఇక్బాల్, లక్ష్మిరెడ్డి, పలువురు ఇతర అధికారులు పార్టీలో చేరారు. జిల్లాల్లో అధికార పార్టీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. జగన్ పాదయాత్ర తమలో ఉత్సాహాన్ని నాలుగింతలు చేసిందని, వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి మరింత గట్టిగా కృషి చేస్తామని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో చెబుతున్నారు. ప్రజా సంకల్ప యాత్ర వేదికగా ప్రత్యేక హోదా వాణిని జగన్ బలంగా వినిపించడంతో పాటు, హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబు.. యూటర్న్ తీసుకుని ప్రజలను మరోమారు మోసం చేయడానికి పన్నిన కుట్రను జగన్ ఎక్కడికక్కడ ఎండగడుతుండటంతో పరిస్థితి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారిందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment