సాక్షి, అమరావతి : ‘‘మద్యం షాపుల్లో ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఓపెన్ డ్రింకింగ్.. బ్రాండ్ మిక్సింగ్.. మాకు తెలియదనుకుంటున్నారా? పోలీసులను వచ్చి కలవడం కర్టసీ. ఇప్పటివరకు మామూళ్లు ఎలా ఇచ్చారో అలాగే నడవాలి. అది సిస్టం. కుదరదంటే రోజూ మా వెహికల్ మీ మద్యం దుకాణం ముందే ఉంటుంది. చట్టం ప్రకారం పోతాం.. ఆ తర్వాత మీ ఇష్టం..’’
అనంతపురం జిల్లాలో ఓ సీఐ మద్యం మామూళ్ల కోసం బరితెగించి చేసిన వ్యాఖ్యలివి. అక్కడి మద్యం వ్యాపారులకు, సీఐకి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. మద్యం అమ్మకాల్లో అక్రమాలు, ఉల్లంఘనలను నియంత్రించాల్సిన పోలీస్, ఎక్సైజ్ మామూళ్ల కోసం సిండికేట్లకు కొమ్ము కాస్తున్నారు. తమ ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దన్న స్థానికులను బెదిరిస్తూ.. మద్యం వ్యాపారానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో మద్యం దుకాణాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమంలో పాల్గొని గుండెపోటుతో ముదునూరి సుబ్బమ్మ అనే మహిళ మరణించినా.. పోలీసుల సహకారంతో గ్రామంలో మద్యం షాపు ఏర్పాటుకు ఇంకా ప్రయత్నించడమే ఇందుకు చక్కటి ఉదాహరణ.
వేళాపాళా లేని మద్యం అమ్మకాలు, బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు గాను మద్యం సిండికేట్లు ఎక్సైజ్ అధికారులకు, పోలీసులకు ఠంఛనుగా నెలవారీ మామూళ్లు ముట్టజెప్పేవారు. ఎక్సైజ్ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహం బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపారు. అప్పటివరకూ నెలకు రూ.లక్షల్లో ముడుపులు అందుకుంటున్న కొందరు ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. కమిషనర్ వ్యవహార శైలితో ఎక్సైజ్ అధికారుల తీరులో కొంత మార్పు వచ్చింది. కానీ, పోలీసులు మాత్రం సిండికేట్లకు ఇతోధిక సహకారం అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అడ్డూ, అదుపులేకుండా సాగుతున్నాయి. మామూళ్ల కోసం పోలీసులు సాగిస్తున్న దందాపై ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం డీజీపీ సాంబశివరావుకు కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు కూడా. మద్యం సిండికేట్లతో జత కట్టిన పోలీసులను కట్టడి చేయాలని ఆ లేఖలో కోరారు. అయినా పరిస్థితిలో మార్పులేకపోగా.. పోలీసుల అండతో సిండికేట్లు రెచ్చిపోతున్నారు. చివరకు బార్ల నిర్వాహకులు పదుల సంఖ్యలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుపుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతంలో ఓ బార్ యజమాని స్థానిక పోలీసు అధికారి సహకారంతో ఏకంగా పది బెల్టు షాపులు నడుపుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్ల నుంచి మామూళ్ల కోసం అనంతపురం టౌన్‌లోని ఓ సీఐ మద్యం సిండికేట్ నేతకు ఫోన్‌చేసి బెదిరించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. మామూళ్లు ఇవ్వకుంటే ప్రతిరోజూ మద్యం షాపు ఎదుట తన వాహనం పెడతానని, వ్యాపారం ఎలా చేస్తారో.. చూస్తానని సదరు సీఐ హెచ్చరించడం గమనార్హం. ఈ తరహా హెచ్చరికల కారణంగానే సిండికేట్లు మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా పెంచి అమ్ముతున్నారు.
పర్మిట్ రూమ్‌లతో అమ్మకాలు, ఘర్షణలు వృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ఈ పర్మిట్ రూమ్‌లవల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నిబంధనల ప్రకారం వీటిని ఏర్పాటు చేయకుండా మినీ బార్లులా ఏర్పాటుచేయడంతో నవంబరు నెలలో రూ.1,400 కోట్ల అమ్మకాలను దాటిపోయాయి. మరోవైపు.. పర్మిట్ రూమ్‌లలో ఘర్షణలూ పెరుగుతున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే నవంబరులోనే పర్మిట్ రూమ్‌లలో మద్యం సేవించి ఘర్షణలు చోటుచేసుకున్న సంఘటనలు పదికి పైగా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
నెలనెలా రూ.87.60 కోట్ల ముడుపులు
ఎమ్మార్పీ ఉల్లంఘనల ద్వారా రాష్ట్రంలో నెలకు రూ.87.60 కోట్ల మామూళ్లు అందుతున్నట్లు అంచనా. ఈ మామూళ్ల జాబితాలో అధికార పార్టీ నేతల నుంచి పోలీస్, ఎక్సైజ్ అధికారులున్న సంగతి బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో మొత్తం 4,380 మద్యం షాపులుంటే, ఎమ్మార్పీ ఉల్లంఘనలకుగాను షాపునకు రూ.లక్ష , బెల్టు షాపు నిర్వహిస్తే మరో రూ.లక్ష వసూలు చేస్తారని గతంలో ఎక్సైజ్ వర్గాలే పలు సందర్భాల్లో వెల్లడించాయి. ఎమ్మార్పీ ఉల్లంఘనల ద్వారా నెలకు రాష్ట్రవ్యాప్తంగా రూ.43.80 కోట్లు వసూలు అవుతాయని, బెల్టు షాపుల ద్వారా నెలకు మరో రూ.43.80 కోట్లు మొత్తం రూ.87.60 కోట్లు, అదే ఏడాదికి రూ. 1,050 కోట్లుకు పైగా వసూలు చేస్తున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లోనూ ఈ విషయం స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment