సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను బెదిరించడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లకు పరిపాటిగా మారిందని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు మండిపడ్డారు. పోలీసులను ఉద్దేశించి వారు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని.. బెదిరింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టిన ఉత్తరాంధ్ర పర్యటన తీవ్ర నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. ‘అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు’ అంటూ విశాఖకు వచ్చిన ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు.. చంద్రబాబు తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ప్రజాగ్రహం కారణంగా చంద్రబాబుకు ఎటువంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో పోలీసులు ఆయనను తిరిగి వెళ్లాలని కోరారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ‘తమాషా చేస్తున్నారా.. సంగతి చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగారు. (ఉరిమిన ఉత్తరాంధ్ర.. బాబుపై తీవ్ర ఆగ్రహం)
ఈ విషయంపై స్పందించిన జనుకుల శ్రీనివాసరావు పోలీసు అధికారుల సంఘం తరఫున శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు.. విశాఖపట్నంలో నిరసనకారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులను ఉద్దేశించి.. ‘గాడిదలను కాస్తున్నారా’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘పోలీసులు కాస్తున్నది శాంతి భద్రతలను.. గాడిదలను కాదు’ అని పేర్కొన్నారు. సమాజంలో అకస్మాత్తుగా చెలరేగే అనివార్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని... పోలీసులు సందర్భానుసారం, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారన్న విషయం మాజీ ముఖ్యమంత్రికి తెలియకపోవడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఎటువంటి హాని కలగకుండా చంద్రబాబుకు రక్షణ కవచంలా నిలిచి ఉన్న పోలీసులను.. ‘సంగతి చూస్తా’ అంటూ బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ సైతం.. ‘‘మేం అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టం’’ అని బెదిరించే ధోరణిలో మాట్లాడటం సరికాదని హితవు పలికారు.(‘అందుకే ప్రజలు బాబును అడ్డుకున్నారు’)
Comments
Please login to add a commentAdd a comment