ప్రయాణికులపై ప్రై‘వేటు’!
రవాణా పన్ను సాకుతో చార్జీలు పెంచిన ట్రావెల్స్
నాన్ ఏసీల్లో రూ.50, ఏసీ బస్సుల్లో రూ. 100 పెంపు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చార్జీల మోత మోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన అంతర్రాష్ట్ర పన్నును సాకుగా చూపుతూ.. ఏకంగా ఒక్కో సీటుపై రూ.50 నుంచి రూ.100 వరకు పెంచేశారు. సర్కారుకు చెల్లించే త్రైమాసిక పన్నుకు రెండింతల సొమ్మును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు ఒక సీటుకు రూ.2,625 చొప్పున 40 సీట్ల (సగటున) బస్సుకు సంబంధించి.. ప్రతి మూడు నెలలకోసారి రూ.లక్షా 10 వేల వరకు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.
అదే ఒక సీటుకు రూ.50 చొప్పున చార్జీ పెంచడంతో నాన్‌ఏసీ బస్సుల్లో మూడు నెలలకు సుమారు రూ.లక్షా 80 వేల వరకు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఏసీ బస్సుల్లో ఒక సీటుకు రూ.వంద చొప్పున పెంచడంతో అదనంగా రూ.3.60 లక్షలు వస్తాయి. మొత్తంగా పన్ను పేరిట అటు ప్రభుత్వం, ఇటు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటుండగా... సాధారణ ప్రయాణికులు మాత్రం బలవుతున్నారు. తెలంగాణ నుంచి ఏపీలోని సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారిపై సగటున రూ.300 నుంచి రూ.500 వరకు అదనపు భారం పడుతోంది. పన్ను విధింపునకు వ్యతిరేకంగా గగ్గోలు పెట్టిన ఆపరేటర్లు ఇప్పుడు మౌనంగా ఉండిపోవడమే.. వారికి వస్తున్న లాభాలకు నిదర్శనం.
సగటు ప్రయాణికుడిపైనే..
రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం, రాజ మండ్రి, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రతి రోజూ 650 నుంచి 700 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్సు లు, రైళ్లకు దీటుగా ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగ ర్, అమీర్‌పేట్, లకిడీకాపూల్, కాచిగూడ తదితర ప్రాంతాల నుంచి ప్రైవేటు బస్సులు బయలుదేరుతాయి.
రాష్ట్రస్థాయి కాంట్రాక్టు క్యారేజీలుగా గుర్తింపు పొందిన ఈ బస్సులు ఇటీవలి వరకు ఉమ్మడి రాష్ట్ర లెక్కల ప్రకారం ప్రతి సీటుకు రూ.2,625 చొప్పున చెల్లించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర పన్ను విధిం చడం, ఈ పన్ను మొత్తాన్ని తుది తీర్పు వెలువడే వరకు ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ నుంచి రాకపోకలు సాగించే బస్సులు ఏపీతో పాటు, తెలంగాణలోనూ త్రైమాసిక పన్ను చెల్లిం చాల్సి వస్తోంది. ఈ భారం అంతిమంగా ప్రయాణికులపైనే పడుతోంది.
చార్జీల పెంపు ప్రభావం ఇలా..
మూడు నెలలకోసారి ఆపరేటర్లు చెల్లించే పన్ను రూ.1,10,000
ఒక సీటుకు చార్జీని రూ.50 చొప్పున పెంచడం వల్ల జమయ్యే మొత్తం నెలకు రూ.60,000 (ఒక నెలలో 15 ట్రిప్పులు)
ఇలా నాన్ ఏసీ బస్సుల్లో వచ్చే మొత్తం మూడు నెలలకు రూ.1.80 లక్షలు
ఏసీ బస్సుల్లో మూడు నెలలకు వచ్చే సొమ్ము రూ.3.60 లక్షల వరకు పెరుగుతుంది
వేసవి సెలవుల్లో మరింత భారం
రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు పరీక్షలు ముగించి సెలవులు ప్రకటించాయి. మరికొన్ని తరగతులకు పరీక్షలు జరుగుతున్నాయి. మే తొలివారం నాటికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల ర ద్దీ బాగా పెరగనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే 80కి పైగా రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. అరకొరగా ఏర్పాటు చేసే అదనపు రైళ్లు ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి.
మరోవైపు సాధారణ రోజుల్లో ఆయా మార్గాల్లో 1,500 బస్సులు నడిపే ఆర్టీసీ కూడా... వేసవి రద్దీకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలను రూపొందించలేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.50 నుంచి రూ.100 వరకు చార్జీలు పెంచిన ఆపరేటర్లు.. వేసవి రద్దీ సమయంలో మరింత భారం మోపే అవకాశం ఉంది.