ఇద్దరికీ ఫీజులు కడతాం! | AP reading in Telangana students to write a letter to the government's decision to pay the money | Sakshi
Sakshi News home page

ఇద్దరికీ ఫీజులు కడతాం!

Published Thu, Oct 2 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ఇద్దరికీ ఫీజులు కడతాం!

ఇద్దరికీ ఫీజులు కడతాం!

కేబినెట్ భేటీలో నిర్ణయం

►   తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వమే చెల్లించాలంటూ లేఖ రాయాలని నిర్ణయం
►    తెలుగుజాతి ఔన్నత్యానికి కృషి చేసిన తెలంగాణ మహనీయుల విగ్రహాలు ఏపీలో ఏర్పాటు
►    పవన, సౌర విద్యుత్తు ప్లాంట్లకు 17,000 ఎకరాలు... పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక కార్పొరేషన్

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చదువుకుంటున్న ఏపీ, తెలంగాణ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, స్కాలర్‌షిప్పులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే.. తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని కోరుతూ అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తయి తరగతులు కూడా ప్రారంభమైనందున స్కాలర్‌షిప్‌‌పుల చెల్లింపు అంశంపై స్పష్టతనివ్వాలని     పలు వర్గాల నుంచి డిమాండ్ల గురించి కేబినెట్లో ప్రస్తావనకు వచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీల్లో ఉన్నత విద్యాభ్యాసానికి చేరుతున్న అర్హులైన ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్ప్‌లు అందిద్దామని సీఎం చంద్రబాబు సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రస్తుతమున్న నిబంధనల మేరకు మెయింట్‌నెన్స్ ఫీజు కింద స్కాలర్‌షిప్ప్‌లు అందించాలని నిర్ణయించారు. ఏపీలో చదువుతున ్న తెలంగాణ విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్ చేస్తున్నందున.. అదే మాదిరిగా తెలంగాణలో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాలని అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు.

 ఆర్టికల్ 371డి, రాష్ట్రపతి ఉత్తర్వుల  ప్రకారమే వెళ్లాలి...

1956 సంవత్సరానికి ముందు తెలంగాణలో ఉన్న వారికే ఫీజుల చెల్లింపు అని తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టినా హైకోర్టు దానికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తపరుస్తూ పునఃపరిశీలన చేయాలని సూచించిన అంశంపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఆర్టికల్ 371డి ప్రకారం, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు చదివిన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపైనే ఉంటుందని, ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. 371డి, రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా వారు వెళ్తే విద్యార్థులను ఆదుకొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అప్పటి పరిణామాలను అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ వరకు వరుసగా నాలుగేళ్ల విద్యాభ్యాసం పూర్తిచేసి, ఏపీ స్థానికతతో తాజాగా తెలంగాణ కాలేజీల్లో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో చేరే వారికి మాత్రం ఫీజులు తామే చెల్లించే అంశంపైనా మంత్రివర్గ భేటీలో చర్చించారు. తెలంగాణ స్థానికత ఉన్న ఆంధ్ర విద్యార్థులకు అక్కడి ప్రభుత్వమే ఫీజులు ఇవ్వాల్సి ఉంటుందని, అదే అంశాన్ని ఆ ప్రభుత్వానికి తెలియచేయాలని నిర్ణయించారు.

అర్హులను గుర్తించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి...

ఇదిలావుంటే.. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారిని గుర్తించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సమావేశంలో అధికారులకు సూచించారు. పెన్షన్లలో అర్హులను గుర్తించడానికి ఏమేరకు చర్యలు తీసుకుంటున్నామో అంతకన్నా గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అర్హులకు ఎంత మందికి ఇచ్చినా ఫర్వాలేదని, అనర్హుడు ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమం వెళ్లేందుకు వీలు లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పొందేందుకు ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు రూ. రెండు లక్షలు, బీసీ విద్యార్థులకు రూ. లక్ష చొప్పున వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని నిర్ణయించారు.

ఏపీలో తెలంగాణ మహనీయుల విగ్రహాలు

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల తొలగింపు విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తెలుగు వారు ఎక్కడున్నా అందరూ ఒక్కటేనని, తెలుగుజాతి ఔన్నత్యాన్ని పెంచిన మహనీయులు ఎక్కడివారైనా పరస్పరం గౌరవించుకోవలసిన అవసరముందని సీఎం, మంత్రులు అభిప్రాయపడ్డారు. ట్యాంక్‌బండ్‌పైని తెలుగువారి విగ్రహాలు తొలగించడం సబబుకాదన్నారు. తెలుగుజాతి ఔన్నత్యానికి కృషి చేసిన తెలంగాణ మహనీయుల విగ్రహాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలన్న భావనకు వచ్చారు.

ఐటీ, పవర్ తప్ప ఏ శాఖ తీరూ బాగోలేదు...

రాష్ట్రంలో విద్యుత్తు, ఐటీ శాఖలు తప్ప మరే శాఖ పనితీరూ అంత సంతృప్తిక రంగా లేదని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 24 గంటల విద్యుత్తు పంపిణీపై సమావేశంలో ఆయన వివరిస్తూ విద్యుత్తు కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రానికి రానున్న కాలంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగం ఐటీయేనని, దానిపై ఎక్కువ దృష్టి సారిస్తున్నామని వివరించారు. ఐటీ, పారిశ్రామికాభివృద్ధికి విద్యుత్తు రంగం ముఖ్యమని, ఈ రెండు శాఖలూ బాగా పనిచేస్తున్నాయని సంతృప్తి వ్యక్తంచేశారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులు కూడా మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు.

పవన, సౌర విద్యుత్తు ప్లాంట్లకు  17,000 ఎకరాలు...

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందిపల్లి వద్ద ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఎకరా ధర రూ. 6 లక్షల చొప్పున 10 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. నెల్లూరులో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి ఎకరా రూ. 42 లక్షల ధరకు 6 సెంట్ల స్థలం, కడపలో కంటి ఆస్పత్రి కోసం భూమి కేటాయించాలని నిర్ణయించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవన, సౌర విద్యుత్తు ప్లాంట్ల కోసం 17,000 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.

శానిటేషన్‌కు కార్పొరేషన్

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినందున రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. దీనికోసం ప్రత్యేకంగా శానిటేషన్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు, ఇతరత్రా మార్గాల ద్వారా ఈ కార్పొరేషన్‌కు నిధులు వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement