డ్వాక్రా యానిమేటర్లకు సర్కార్‌ షాక్‌! | AP Sarkar Shock for Dvakra animators! | Sakshi
Sakshi News home page

డ్వాక్రా యానిమేటర్లకు సర్కార్‌ షాక్‌!

Published Sun, Nov 25 2018 1:30 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

AP Sarkar Shock for Dvakra animators! - Sakshi

సాక్షి, అమరావతి : డ్వాక్రా యానిమేటర్లకు ఏడాదిపాటు రూ.3వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. ఏడాది కాదు కేవలం ఐదు నెలలే అంటూ సెలవు రోజున ఆ జీవోకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఈనెల 6న ఇచ్చిన జీఓ నెం.1243ను సవరిస్తూ శనివారం కొత్తగా జీవో నెం.1300ను విడుదల చేసింది. వాస్తవానికి శనివారం సచివాలయ సిబ్బందికి సెలవు దినం.

తాజా నిర్ణయం బయటకు పొక్కకూడదనే ఉద్దేశ్యంతోనే సెలవు రోజున జీవో ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా యానిమేటర్లకు నవంబరు ఒకటి నుంచి ఏడాది పాటు నెలనెలా రూ.3 వేల చొప్పున చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజు ఈనెల 6న ఉత్తర్వులిచ్చారు.

కానీ, ప్రభుత్వం తాజాగా జారీచేసిన సవరణ జీవోలో ఏడాది పాటుకు బదులు 2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సెర్ప్‌కు కేటాయించిన నిధులు అందుబాటులో ఉన్నంత వరకే అని పేర్కొన్నారు. అంటే.. 2019 మార్చి నాటికి 2018–19 బడ్జెట్‌ కేటాయింపులన్నీ అయిపోతాయి. దీంతో కేవలం ఐదు నెలలపాటే రూ.3వేల చొప్పున ఆర్థిక సహాయం చేసే వీలు ఉంటుంది. 


అడగడుగునా మోసమే
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 27,718 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 7.30 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాలు ఉండగా, వాటిని 27,710 గ్రామ సమైఖ్యలుగా వర్గీకరించారు. సంఘ ఆర్థిక లావాదేవీలను, ఇతర వ్యవహారాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి సంఘాలకు రుణాలు ఇప్పించడం వంటి కార్యకలాపాల నిర్వహణకు ప్రతి గ్రామ సమైఖ్యకు ఓ యానిమేటర్‌ను ప్రభుత్వం నియమించింది.

వీరికి గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతినెలా రూ.2 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దానిని రద్దుచేశారు. గౌరవ వేతనం కొనసాగించాలంటూ 2015లో 75 రోజులపాటు యానిమేటర్లు సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. యానిమేటర్లను ఉద్యోగులుగా పరిగణించలేమని.. జీతాలు ఇచ్చేదిలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమ్మె విరమించకపోతే వేరొకరిని నియమిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో యానిమేటర్లు విధిలేని పరిస్థితుల్లో సమ్మె విరమించారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే యానిమేటర్లకు గౌరవ వేతనం చెల్లిస్తామని ఆ పార్టీ హామీ ఇవ్వడంతో  చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. గౌరవ వేతనంగా కాకుండా ఏడాదిపాటు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు మాట మార్చి కేవలం ఐదు నెలల కాలానికి పరిమితమ్యేలా నిబంధనలు పెట్టి సవరణ ఉత్తర్వులిచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement