* కేంద్రం వద్దకు చేరిన ఇరు రాష్ట్రాల పంచాయితీ
* అన్ని వివాదాలను కేంద్రమే పరిష్కరించాలని ఇద్దరు సీఎస్‌ల వినతి
* కేంద్ర హోం కార్యదర్శితో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారుల భేటీ
* కమలనాథన్, ప్రత్యూష్‌సిన్హా కమిటీలతోనూ వేర్వేరుగా సమావేశం
* అన్ని అంశాలపై మరోసారి వాదనలు వినిపించిన అధికారులు
* ఉద్యోగుల పంపకాలపై నోడల్ కమిటీని వేయాలని ప్రతిపాదన
* ఐఏఎస్‌ల కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని ఏపీ సీఎస్ విజ్ఞప్తి
* ప్రోత్సాహకాలపై నిర్ణయం తీసుకోవాలన్న టీ-సీఎస్ రాజీవ్ శర్మ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన అనేక సమస్యలకు సంబంధించిన పంచాయితీ కేంద్రం వద్దకు చేరింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేయాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆయా సమస్యలపై రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పరిశీలించి, న్యాయ సలహా మేరకు తుది నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు స్పష్టం చేశారు.
పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోం కార్యదర్శి అనిల్ గోస్వామితో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతోపాటు రెండు రాష్ట్రాల విద్యుత్, నీటిపారుదల, ఇంధన, ప్లానింగ్ శాఖల కార్యదర్శులు శుక్రవారం సమావేశమయ్యారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ, అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీపై పనిచేస్తున్న ప్రత్యూష్ సిన్హా కమిటీతోనూ ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా భేటీ అయ్యారు.
ఉదయం కమల్‌నాథన్ కమిటీతో భేటీ సందర్భంగా.. ఉద్యోగుల పంపకాల తుది గడువు, దీనికి సంబంధించిన ప్రక్రియపై ఇరు రాష్ట్రాల అధికారులు మరోమారు కూలంకషంగా చర్చించారు. పోస్టులు తక్కువగా, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కొన్ని శాఖల్లో సర్దుబాటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఉద్యోగుల విభజనలో వచ్చే సమస్యల పరిష్కారం, ఇతర అనుమతులకు సంబంధించి ఓ నోడల్ కమిటీని వేయాలన్న ప్రతిపాదనను ఇరువురు సీఎస్‌లు కేంద్రం దృష్టికి తెచ్చారు.
వివాదాలపై వాడివేడి చర్చ
రాష్ర్ట విభజన చట్టంలోని అంశాల అమలులో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముందు ఇరువురు సీఎస్‌లు తమతమ వాదనలు వివరించారు. విద్యుత్ కేటాయింపులు, నదీజలాల పంపకాలు, షెడ్యూల్ తొమ్మిది, పదిలోని ఉమ్మడి సంస్థల నిర్వహణ , ఉమ్మడి పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. కృష్ణా బోర్డు ఇచ్చిన ఏకపక్ష నోటీసుల అంశాన్ని తెలంగాణ సీఎస్ ప్రస్తావించారు. ఈ విషయంలో ఏపీ వైఖరి సరిగా లేదని, కావాలనే సమస్యలు సృష్టిస్తోందని ఫిర్యాదు చేశారు.
కృష్ణా ట్రిబ్యునల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని రాజీ వ్‌శర్మ కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 8 ప్రకారం హైదరాబాద్‌లో పోలీసు యంత్రాంగా న్ని గవర్నర్ పరిధిలోకి తేవాలని ఏపీ సీఎస్ కోరగా.. అందుకు రాజీవ్‌శర్మ అభ్యంతరం తెలి పారు. చట్టంలో అలా పేర్కొనలేదన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రస్తావిస్తూ.. పీపీఏలను అమలు చేసేలా చూడాలని తెలంగాణ సీఎస్ కోరారు.
ఉమ్మడి సంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేకుండానే ఏపీకి నిధులు మళ్లించుకున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై అనిల్ గోస్వామికి ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా నివేదికలను అందజేసినట్టు సమాచారం. పదో షెడ్యుల్‌లో పేర్కొన్న సంస్థలు భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నం దున వాటి నిర్వహణ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఎలా ఉంటుందని రాజీవ్ శర్మ ప్రశ్నించినట్లు సమాచారం. ఐవైఆర్ కృష్ణారావు కూడా దీనిపై తన వాదన వినిపించారు. ఇక ఉమ్మడి పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ తీరు ఇబ్బం దికరంగా ఉందని కూడా ఆయన కేంద్రం దృష్టికి తెచ్చారు.
విభజన చట్టంలో చెప్పిన ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఉమ్మడిగా చేపట్టాలని వివరించారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి వివాదాన్ని కూడా ప్రస్తావించారు. స్థూలంగా అన్ని సమస్యలపై ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని, న్యాయ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని ఇరువురు సీఎస్‌లు హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద ఇరు రాష్ట్రాలకు దక్కాల్సిన పలు సదుపాయాలను కేంద్రం దృష్టికి తెచ్చాం.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాలను కూడా వివరించాం. వాటన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి చె ప్పారు’ అని ఏపీ సీఎస్ కృష్ణారావు వెల్లడించారు. చట్టంలో పేర్కొన్న అంశాలపై త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్టు టీ-సీఎస్ రాజీవ్‌శర్మ తెలిపారు. ‘తెలంగాణకు ఇచ్చే ప్రోత్సాహకాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. విభజన చట్టంలోని విధానాల అమలుపై రాష్ర్టం తరఫున ప్రతిపాదనలు పంపుతాం. అదేవిధంగా ఏపీ కూడా పంపుతుంది. వీటిపై న్యాయ సలహా తీసుకుని నిర్ణయం చెప్పాలని కేంద్రాన్ని కోరాం. ఈ సమావేశాలు విజయవంతంగా కొనసాగాయి. సత్ఫలితాలు వస్తాయనుకుంటున్నాం’ అని రాజీవ్‌శర్మ పేర్కొన్నారు.
కాగా, సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల విభజన అంశంపై ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఇద్దరు సీఎస్‌లు భేటీ అయ్యారు. ఐఏఎస్‌ల కేటాయింపుల ఫైలును ప్రధాని నరేంద్రమోదీ తిప్పి పంపిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇరువురు సీఎస్‌లు పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలని కమిటీని కోరారు.
ఇక తుది నిర్ణయం మీదే!
Published Sat, Nov 29 2014 2:18 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
Advertisement