‘విద్యుత్’పై తెగని పంచాయితీలు | AP, Telangana power disputes | Sakshi
Sakshi News home page

‘విద్యుత్’పై తెగని పంచాయితీలు

Published Mon, Dec 1 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

AP, Telangana power disputes

* హిందుజా, కృష్ణపట్నం ప్రాజెక్టులపై 2 రాష్ట్రాల మధ్య జగడం
* ఏపీ పీపీఏల రద్దుతో మొదలైన వివాదాలు
* రెండు ప్రాజెక్టులూ తమవే అంటోన్న ఏపీ
* తమకూ వాటా ఉందని తెలంగాణ వాదన
* ప్రాజెక్టు లాభాల్లో వాటా ఇస్తామన్న ఏపీ
* విద్యుత్ వాటా ఇవ్వాలని టీ సర్కారు పట్టు
* కృష్ణా బోర్డుకు చేరిన ‘శ్రీశైలం’ వివాదం
* ఎటూ తేలని వివాదాలు.. కేంద్ర విద్యుత్ మండలి పరిష్కరించే అవకాశమూ లేదు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెన్‌కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం మొదలైంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర వివాదాల్లో ఉన్న రెండు ప్రధాన విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారం ఆరు నెలలయినా కొలిక్కి రాలేదు. కృష్ణపట్నం ప్రాజెక్టు ఎప్పుడో వాణిజ్య ఉత్పత్తికి వెళ్ళాల్సి ఉన్నా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది.

హిందుజా ప్రాజెక్టుకు సంబంధించి రెండు రాష్ట్రాలూ పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపోతోంది. హిందుజాను ఏపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుంటే.. అసలా విషయమై తెలంగాణతో మాట్లాడటానికే ఏపీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఈ రెండు ప్రాజెక్టులపైనా న్యాయస్థానానికి వెళ్ళేందుకు కూడా ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఇక శ్రీశైలం విద్యుత్ వివాదం సరేసరి. ప్రాజెక్టు నీటిని సాగునీటి అవసరాలకే వాడుకోవాలనేది ఏపీ వాదన. విద్యుత్ ఉత్పత్తి కూడా సాగు నీటి కోసమే అనేది తెలంగాణ వాదన. అంతిమంగా ఈ వివాదం కృష్ణా బోర్డు వరకూ వెళ్ళింది.

హిందుజా దారికొచ్చినట్టేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా హిందుజా ప్రాజెక్టును రెండు దశాబ్దాల క్రితం ప్రతిపాదించారు. అనేక సాంకేతిక, భూ సమస్యలను అధిగమించి ఎట్టకేలకు 2012లో ఇది పూర్తయింది. మొత్తం 1,040 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నెలకొల్పిన విద్యుత్ ప్రాజెక్టు విభజన నాటికే ఉత్పత్తికి సిద్ధమైంది. ఇందులో ఉభయ రాష్ట్రాలకు వాటా కల్పిస్తూ విభజన సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం భాగస్వామ్యం కల్పించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా జరిగింది. అయితే విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి దీన్ని ఆమోదించలేదు. దీన్ని ఏపీ సర్కారు సాంకేతికాంశంగా చూపుతోంది.

పీపీఏ కానప్పుడు ఆ రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వాలన్న వాదన సహేతుకం కాదని వాదిస్తోంది. దీనిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. వివాదం ముదురుతున్న దశలోనే ఏపీ జెన్‌కో ఇటీవల హిందుజాతో చర్చలు జరిపింది. డిసెంబర్ 5వ తేదీలోగా హిందుజా పీపీఏ కుదుర్చుకునేందుకు అంగీకారం తెలిపింది. ఇది గుర్తించిన తెలంగాణ జెన్‌కో హిందుజాను చర్చలకు పిలవడం, ఆ సంస్థ ఇందుకు సుముఖంగా లేకపోవడంతో వివాదం ముదిరింది. పీపీఏ జరిగితే హిందుజాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ జెన్‌కో హెచ్చరించింది.

కృష్ణపట్నం పరిస్థితీ అంతే..!
ఉమ్మడి రాష్ట్రంలో గర్వంగా చెప్పుకుంటూ వచ్చిన కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు వివాదం కూడా అపరిష్కృతంగానే ఉంది. ఇందులో 54 శాతం వాటా ఉందని తెలంగాణ అంటోంది. పీపీఏ జరగలేదు కాబట్టి ఆ హక్కు లేదని ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. పెట్టుబడులున్నాయి కాబట్టి లాభాల్లో వాటా ఇస్తామంటోంది. ఇటీవల పాలకమండలి సమావేశంలో దీన్ని తెలంగాణ జెన్‌కో అధికారులు చర్చకు పెట్టారు. ఏపీ జెన్‌కో దీన్ని ఎజెండాలో లేదంటూ తోసిపుచ్చింది. వాస్తవానికి కృష్ణపట్నం ఆరు నెలల కిందటే వాణిజ్య విద్యుత్ ఉత్పత్తికి వెళ్ళాలి. రేపో మాపో సీఓడీ జరగాల్సి ఉండగా మళ్లీ సాంకేతిక లోపం రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్న ఏపీ, ఆరు నెలలుగా తానే వాడుకోవడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

‘కేంద్రం’ పరిష్కరించే వీలూ లేదు!
విభజన సందర్భంగా ముందస్తు ఆలోచన లేకపోవడమే సమస్యకు కారణంగా కనిపిస్తోంది. విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించని ఈ ప్రాజెక్టులపై స్పష్టమైన ఆదేశం ఇచ్చి ఉంటే, రెండు రాష్ట్రాలు పరస్పర వాదులాటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఇందులో న్యాయపరమైన సమస్యలూ ఉన్నాయి. కేంద్ర విద్యుత్ మండలి దీన్ని పరిష్కరించే అవకాశం కూడా లేదు. ఏదైనా ప్రాజెక్టు ఒక రాష్ట్రం కాకుండా ఎక్కువ రాష్ట్రాలకు చెందితేనే సీఈఆర్‌సీ జోక్యం చేసుకోవాలి. రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌వే అని ఆ రాష్ట్రం చెప్పుకుంటున్నప్పుడు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దీన్ని పరిష్కరించే అవకాశం కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement