సాక్షి, అనంతపురం : టెట్(టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్) నిర్వహణపై అయోమయం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పీడు పెంచిన నేపథ్యంలో సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఎన్జీఓలు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు.
ఇందులో భాగంగా పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఎన్‌న్జీఓలు అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. టెట్ నిర్వహణ కోసం 1552 మందిని ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయేతర సిబ్బందిని నియమించారు. పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్ల కొరత ఏర్పడనుంది. ఇన్విజిలేటర్లుగా నియమించిన 1552 మందికి కూడా నియామక ఉత్తర్వులను బుధవారం అందజేశారు. సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్లుగా ఎలా వెళ్తామని ప్రశ్నించిన సిబ్బందికి కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఇన్విజిలేటర్ల నియామక పత్రాలు తీసుకోవాల్సిందేనని గట్టిగా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో తీసుకున్నారు.
మరో వైపు ఇన్విజిలేటర్లుగా నియమించిన వారందరికీ శనివారం శిక్షణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరందరూ కూడా గురువారం నుంచి సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్లుగా వెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నారు. జిల్లాలో 19884 మంది టెట్ కోసం దరఖాస్తు చేసుకోగా పరీక్ష కోసం 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సమ్మెలో వెళ్తున్నందున ఇన్విజిలేటర్ల కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఇన్విజిలేటర్లుగా డీఆర్‌డీఏ, డ్వామా కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా, వీరందరూ పరీక్షల నిర్వహణపై ఏమాత్రం పరిజ్ఞానం లే నందున టెట్ నిర్వహించడం తమ వల్ల కాదని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆఖరుకు వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలను ఇన్విజిలేటర్లుగా నియమించాలని చూస్తున్నా జిల్లాలో 350 మందికి మించి పీఈటీలు లేనందున మిగిలిన 1200 మందిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో జిల్లా యంత్రాంగానికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. పరీక్ష నిర్వహణ కోసం ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో 136 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆపీసర్లకు గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో సమావేశం ఏర్పాటు చేశారు.
టెట్టెలా?
Published Thu, Feb 6 2014 2:21 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
Advertisement
Advertisement