కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల అర్హత పరీక్ష(టెట్)ను ఈ నెల 16న నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 19 కేంద్రాల్లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 వరకు 103 కేంద్రాల్లో పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు. పేపర్ వన్ నిర్వహించే పరీక్షా కేంద్రానికి ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం పేపర్ టు పరీక్ష నిర్వహించే కేంద్రానికి 1.30 గంటలకు అభ్యర్థులు హాజ రుకావాలని డీఈవో కె. నాగేశ్వరరావు తెలిపారు.
ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేసి, పరీక్షా కేంద్రానికి సంబంధించిన మెటీరియల్‌ను తీసుకుని వెళ్లాలన్నారు. కేంద్రాల వద్ద వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
హాల్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు తప్పక హాజరుకావాలన్నారు. కర్నూలు డివిజన్‌లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఒకేషనల్ ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని, వారిని పాఠశాల నుంచి రిలీవ్ చేయాలని హెచ్‌ఎంలను ఆదేశించారు.
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులను గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి.
ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు.
అభ్యర్థులు ఇది వరకు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు అనుమతించబడును(ఫిబ్రవరి-2014)
అభ్యర్థులు తమ ప్యాడ్, బ్లాక్‌బాల్ పాయింట్ పెన్ను వెంట తెచ్చుకోవాలి.