సాక్షి, అమరావతి: రాజధాని వ్యవహారాల ప్రస్తుత పరిస్థితిని తెలిపేలా నివేదికలు తయారు చేయడంలో సీఆర్‌డీఏ నిమగ్నమైంది. ఈ నెల ఆరో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఆర్‌డీఏపై సమీక్ష నిర్వహిస్తుండడంతో ఆ రోజుకి పూర్తి వివరాలతో నివేదికలను సిద్ధం చేసే పనిలోపడ్డారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు మంజూరై మొదలుకాని పనులు, మంజూరైనా ఇప్పటివరకూ 25 శాతం కూడా పూర్తికాని పనుల వివరాలను ఆయా విభాగాల అధికారులు సేకరిస్తున్నారు. ఇందుకోసం సీఆర్‌డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ శనివారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో హెచ్‌ఓడీలందరితో సమావేశమయ్యారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఎడాపెడా పలు పెద్ద ప్రాజెక్టులను వివిధ నిర్మాణ సంస్థలకు కేటాయించిన నేపథ్యంలో వాటన్నింటి వివరాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. తీవ్ర వివాదాస్పదమైన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు గురించి ప్రత్యేక నోట్ రూపొందిస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఈ ప్రాజెక్టును వివాదాస్పద రీతిలో సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు హడావుడిగా సింగపూర్ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ఇప్పటికీ మొదలుకాలేదు. రాజధాని భూసమీకరణ, భూములకు సంబంధించిన వ్యవహారాలు, రైతుల లేఅవుట్ల వివరాలతో మరో నివేదికను తయారు చేస్తున్నారు. సోమవారానికి ఈ నివేదికను సిద్ధం చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment