జెన్‌కోలో జబర్దస్తీ!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్‌కో)లో జబర్దస్తీ నడుస్తోంది. ఓ అధికారిణికి పదోన్నతి కల్పించేందుకు వీలుగా మెడికల్ సెలవులో వెళ్లాలంటూ మరో అధికారిపై ఒత్తిళ్లు వస్తున్నాయి. కొత్తగా నియమితులైన డెరైక్టర్ ఒకరు సదరు అధికారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేయడం జెన్‌కోలో చర్చనీయాంశమయ్యింది. మొన్నటివరకు ఆరోగ్యం సరిగా లేక సెలవులో ఉన్న ఓ అధికారి.. కొద్దిరోజుల క్రితమే డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతిపై తిరిగి ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా ఉన్న అధికారిణి ఒకరు మొన్నటివరకు డిప్యూటీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
అయితే, ఆమె పదవీ విరమణ చేసేలోపు డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి మెడికల్ సెలవులో వెళ్లాలంటూ ఆ డిప్యూటీ సెక్రటరీపై డెరైక్టర్ ఒకరు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. ఆ అధికారి తర్వాత పదోన్నతిలో ఉన్న సదరు అధికారిణి కోసమే ఈ తతంగమంతా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డిప్యూటీ సెక్రటరీపై తెస్తున్న ఒత్తిళ్ల వల్ల మళ్లీ అనారోగ్యానికి గురైతే అందుకు ఎవరిది బాధ్యత అని పలువురు జెన్‌కో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పదోన్నతి ఆశిస్తున్న సదరు అధికారిణిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి బదిలీకి డబ్బులు డిమాండ్ చేస్తారని, ఉద్యోగుల బదిలీలపై మేనేజింగ్ డెరైక్టర్ ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులకు సైతం ఆమె పదోన్నతులు ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు ఉన్న సదరు అధికారిణిని కొత్తగా నియమితులైన డెరైక్టర్ వెనుకేసుకురావడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకుని డెరైక్టర్‌గా వచ్చిన తర్వాత ఇలా వ్యవహరించడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.