అప్పన్నకు రికార్డు స్థాయి ఆదాయం
- 25 రోజుల్లో రూ.1.23 కోట్ల ఆదాయం
- దేవస్థానం చరిత్రలో ఇదే అధికం
సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం ఆలయ చరిత్రలోనే తొలిసారిగా రూ. కోటి దాటింది. సింహగిరిపై ఉన్న కల్యాణమండంలో సోమవారం హుండీ ఆదాయం లెక్కించగా గత 25 రోజులకుగాను రికార్డు స్థాయిలో రూ. 1,23,67,498 లభించింది. నగదుతో పాటు 126 గ్రాముల బంగారం, 14 కిలోల 600 గ్రాముల వెండి లభించాయి. గత 25 రోజుల్లో సింహాచల క్షేత్రంలో గంథం అమావాస్య, చందనోత్సవం, వైశాఖ పౌర్ణమి ఉత్సవాలు జరిగాయి.
ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ మధ్యలో వచ్చిన శని, ఆదివారాల్లో సింహగిరి భక్తులతో పోటెత్తింది. ఇవన్నీ కలిసి దేవస్థానానికి రికార్డు స్థాయి ఆదాయం తెచ్చిపెట్టాయి. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైదికులు, శ్రీహరి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు హుండీల్లో వేసిన వెండి పాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.