కర్నూలులో తపాలా కార్యాలయం తెరవకముందే పడిగాపులు కాస్తున్న యువత (ఇన్‌సెట్లో) అప్లికేషన్ ఫీజు కట్టేందుకు క్యూకట్టిన యువకులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టుమెన్/ మెయిల్‌గార్డు పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. పోటీ పెరగడంతో నిరుద్యోగులు ఫీజు కట్టేందుకు కూడా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. గత నెల 14న నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూరించుకుని ఫీజు పోస్టాఫీసుల్లో చెల్లించుకునే పద్ధతి పెట్టారు. రీజియన్ పరిధిలో 60 పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లాకు 21 కేటాయించారు. వాటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 5, మిగతా 11 పోస్టులు అన్‌రిజర్వుడ్ కేటగిరీలోకి వస్తాయి. పురుషులు రూ. 500, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చొప్పున హెడ్ పోస్టాఫీసుల్లో ఫీజు కట్టాల్సి ఉంది.
జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాలలో మాత్రమే హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఫీజులు కట్టేందుకు ఈ మూడు పోస్టాఫీసులే శరణ్యమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడంతో చాంతాడంత క్యూలు ఏర్పడుతున్నాయి. అభ్యర్థులు పోస్టాఫీసు తెరవక ముందే వచ్చి కూర్చుంటున్నారు. పక్షం రోజుల వ్యవధిలోనే కర్నూలు, ఆదోని, నంద్యాల హెడ్ పోస్టాఫీసుల్లో 15 వేల దరఖాస్తులు రావడం గమనార్హం. ఇంకా పక్షం రోజుల గడువు ఉండటంతో మరో 15 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజూ వందలాది అభ్యర్థులు పోస్టాఫీసులకు వస్తున్నా..అధికారులు వారికి కనీసం మంచినీటి సదుపాయం కూడా సమకూర్చడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment