
మరో 361 పోస్టులకు నోటిఫికేషన్
ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించిన ఏపీపీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు వేర్వేరు నోటిఫికేషన్‌లను జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు www. psc. ap. gov. in వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు. ఈ పోస్టుల కోసం జనవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఆయా నోటిఫికేషన్లకు 25 వేలకు మించి దరఖాస్తులు వచ్చినట్లయితే.. స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్క్రీనింగ్ టెస్టు సమాచారాన్ని వెబ్‌సైట్‌ద్వారా అభ్యర్థులకు తెలియచేస్తారు. కంప్యూటర్ ఆధారిత మెయిన్ పరీక్ష తేదీలను వెబ్‌సైట్లో పేర్కొన్నారు. ఇది ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటుందని తెలిపారు. అన్ని నోటిఫికేషన్ల పరీక్షలు నెగిటివ్ మార్కుల విధానంలో జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో నంబర్ 235 ప్రకారం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు తప్పుడు సమాధానాలిస్తే ఒక్కో తప్పుడు జవాబుకు 1/3 చొప్పున మార్కుల కోత విధిస్తారన్నారు. అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు వెబ్‌సైట్లో మాక్‌టెస్టు సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. నోటిఫికేషన్ల వారీగా పోస్టుల సంఖ్య, విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, సిలబస్ తదితర వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు.