హాస్టళ్లలో అప్పుకూడు
దేవానంద్ (అసలు పేరు కాదు) ప్రభుత్వ వసతి గృహం హెచ్‌డబ్ల్యుఓ(హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్). ఇతనికి నెల జీతం రూ. 40 వేలు. కటింగ్‌లు పోను రూ. 27 వేల వరకు చేతికి వస్తుంది. ఇతని హాస్టల్‌లో 70 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి డైట్ ఖర్చుల కోసం నెలకు రూ. 40 వేలకు పైగా అవసరం. మూడు నెలల నుంచి డైట్ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. తన జీతం కూడా సరిపోకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నాడు. ఇది జిల్లాలోని హెచ్‌డబ్ల్యుఓల పరిస్థితి.
కడప రూరల్ :
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలోని వసతి గృహాల్లోని విద్యార్థులకు సంబంధించిన డైట్ బిల్లులు మూడు నెలలుగా మంజూరు కాలేదు. పిల్లల కడుపులు మాడ్చకుండా చూడాలని పలువురు హెచ్‌డబ్ల్యుఓలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పులు చేసి చిన్నారుల ఆకలి తీర్చుతున్నారు. అప్పులు పెరుగుతున్నా నాలుగు నెలలుగా బిల్లుల మంజూరు జాడలేదు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని 217 వసతి గృహాల్లో సుమారు 20650 మంది విద్యార్థులు ఉన్నారు.
వీరికి బియ్యం, కరెంటు ఛార్జీలు మినహా ఫుడ్ డైట్‌కు సంబంధించి కందిబేడలు, చింతపండు, కూరగాయలు, గుడ్లు, అరటిపండు తదితర ఆహార పదార్థాల కోసం నెలకు ఒక విద్యార్థికి ఏడవ తరగతి వరకు చదివే వారికి రూ. 750, ఆపైన 10వ తరగతి వరకు చదివే వారికి రూ. 810 చొప్పున చెల్లించాలి. ఆ ప్రకారం హెచ్‌డబ్ల్యుఓలకు మూడు నెలలకు ఒకసారి డైట్ బిల్లులు మంజూరు కావాలి.
ఆ మేరకు మూడు నెలలకు సంబంధించి అన్ని హాస్టళ్లకు కలిపి రూ.4.46 కోట్లు మంజూరు కావాలి. ఇందుకు సంబంధించిన జులైలో కొంతమందికి మాత్రమే మంజూరు కాగా, మరికొంతమందికి మంజూరు కాలేదు. ఆగస్టు నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా మంజూరు కాకపోవడంతో హెచ్‌డబ్ల్యుఓలు అవస్థలు పడుతున్నారు.