నియామకాల్లో ‘కాంట్రాక్టు’ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలన్నీ రెగ్యులర్ విధానంలోనే జరుగనున్నాయి. అయితే, నిర్ణీత గడువు వరకు మాత్రం అప్రెంటిస్ లేదా ట్రెయినీగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా నిర్ణయాలేమీ తీసుకోకుండానే వారి సర్వీసు క్రమబద్ధీకరణ జరుగుతుంది. సోమవారం రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన రవాణా, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం జరిగిన భేటీలో అధికారులతో పాటు గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతలు కూడా పాల్గొన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసును వచ్చే ఏడాది ఆఖరులోగా క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటామని బొత్స హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టడానికి, భవిష్యత్‌లో ఆ విధానాన్ని కొనసాగించడానికి వీలుగా ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తూ గతంలో జారీ చేసిన జీవోను సవరించి, మరింత స్పష్టతతో జీవో ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తొలి విడత 9,518 మంది క్రమబద్ధీకరణ: ఎన్‌ఎంయూ
సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె విరమణ సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు తొలివిడతలో 9,518 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను క్రమబద్ధీకరించడానికి మంత్రి బొత్స అంగీకరించారని ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్ తెలిపారు.
ఆర్టీసీలో ఇక రెగ్యులరే!
Published Tue, Nov 26 2013 3:21 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
Advertisement
Advertisement