ఒంగోలు, న్యూస్‌లైన్:
సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మె ప్రభావం ఆర్టీసీపై తీవ్రంగా ఉంది. రోజువారీ కార్యకలాపాలు సైతం నిలిచిపోయి బస్సుల కండీషనే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ చూపడం మాని, ప్రభుత్వ విభాగంగా గుర్తించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు బస్సులు బయటకు తీయబోమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగకు సైతం ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారనుంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లావ్యాప్తంగా ఉన్న 850 ఆర్టీసీ సర్వీసులు 48 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి.సరాసరిన రీజియన్ వ్యాప్తం గా రోజుకు * 70 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించేది.ఇప్పటి వరకు సమ్మె వల్ల ఆర్టీసీ నేరుగా కోల్పోయిన ఆదాయం * 33.60 కోట్లు. బస్సులు నడవకున్నా.. ఆర్టీసీకి సాధారణంగా ఉండే ఖర్చు ఏమాత్రం తగ్గదు. పారిశుధ్యం, కరెంటు ఖర్చులు, సెక్యూరిటీ సిబ్బంది, ఉన్నతాధికారుల జీతభత్యాలు చెల్లించడం తప్పనిసరి. రోజూ బస్సులు తిరుగుతున్నప్పుడే ఏటా * 20 కోట్ల నష్టాన్ని చవిచూసే ఆర్టీసీ ప్రకాశం రీజియన్ నష్టం ఈ ఏడాది ఇంకా పెరుగుతుంది.
ఆర్టీసీకి అత్యధికంగా ఆదాయం సమకూరేది శ్రావణమాసం, దసరా, సంక్రాంతి పండుగ సీజన్లే. అయితే శ్రావణమాసం మొత్తం సమైక్యపోరు కొనసాగడంతో ఆర్టీసీ గణనీయంగా ఆదాయం కోల్పోయింది. ప్రస్తుతం దసరా సీజన్ రాబోతోంది. ఏటా దసరా పండుగ సమయంలో పది రోజుల్లో దాదాపు కోటిన్నర రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జిస్తుంది. దసరా, సంక్రాంతి పర్వదినాలకు పండగ ముగిసిన తరువాత కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఎక్కువగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు ఈ సర్వీసులు నడుస్తుంటాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ప్రత్యేక సర్వీసులకు తిరుగు ప్రయాణం ఉండదంటూ ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీ వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఏకంగా వంద శాతం అదనంగా వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు.
ఇష్టారాజ్యంగా దండుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు:
సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఆడింది ఆట..పాడింది పాట అన్నట్లుగా మారిపోయింది. ఒకే రకమైన బస్సులు నడుపుతున్నా..ఆపరేటర్‌ను బట్టి చార్జీలు మారుతున్నాయి. ఒక ఆపరేటర్ ప్రస్తుతం హైదరాబాద్‌కు * 550 వసూలు చేస్తుంటే..మరో ఆపరేటర్ * 600, ఇంకో ఆపరేటర్ * 650 వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీ సర్వీసులకు సాధారణ టికెట్టు ధర * 360. అంటే దాదాపు 70 నుంచి 80 శాతం చార్జీని అదనంగా ప్రైవేటు ఆపరేటర్లు దండుకుంటున్నారు.
దసరాకు రాకపోకలు కష్టమే...
సాధారణంగా దసరా పండుగకు ముందు హైదరాబాద్ నుంచిఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతుంది. పండుగ తరువాత సంబంధిత రీజియన్లు తమ ప్రాంతాల నుంచి బస్సులను రద్దీని బట్టి నడుపుతుంటాయి. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల హైదరాబాద్ నుంచి బస్సులు జిల్లాలకు వచ్చే అవకాశాలు లేవు. దీంతో తిరుగు ప్రయాణమే కాదు..అసలు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు చేరడం కూడా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు టికెట్ల ధరలను 200 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి.
రైల్వేలో అదనపు చార్జీ:
పెరిగిన రద్దీ నేపథ్యంలో రైల్వే ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేసింది. జనరల్ టికెట్ కౌంటర్లను పెంచింది. గతంలో రద్దీ సమయంలో రెండు కౌంటర్లు పనిచేసేవి. వాటి స్థానంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ సమయంలో సైతం ఒక కౌంటర్‌కు బదులుగా రెండు కౌంటర్లు నిర్వహిస్తున్నారు. గతంలో 9 వేలమంది ప్రయాణికులు రోజూ ఒంగోలు రైల్వేస్టేషన్‌కు వస్తుండగా ప్రస్తుతం వీరి సంఖ్య 14 వేలకు చేరింది. అదే విధంగా ఒంగోలు నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారి సంఖ్య కూడా ఇదే మోతాదులో పెరిగింది. ఆర్టీసీ జనరల్ ఆదాయం గతంలో రోజుకు * 4 లక్షలు ఉండేది. కానీ ఆర్టీసీ చక్రాలు ఆగినప్పటి నుంచి సరాసరిన రోజుకు *2.50 లక్షలు చొప్పున ఇప్పటి వరకు * 95 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే ఆర్టీసీ * 33.60 కోట్ల ఆదాయాన్ని కోల్పోగా అందులో రైల్వే చేజిక్కించుకున్న ఆదాయం కేవలం * 1.25 కోట్లు. అంటే * 32.25 కోట్ల ఆదాయం ప్రైవేటు రవాణాకు వెళ్లినట్లు స్పష్టమవుతోంది.
సమ్మె వల్ల ఆర్టీసీ కోల్పోయిన ఆదాయం రూ. 33.60 కోట్లు
Published Tue, Oct 1 2013 2:31 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement