కోటప్పకొండ తిరునాళ్లకు సన్నద్ధం
ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
నరసరావుపేట రూరల్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పండగగా నిర్వహించే కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లను జయప్రదం చేసేందుకు ఆర్టీసీ సన్నద్ధం కావాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్ణానంగారి శ్రీహరి తెలిపారు. కోటప్పకొండలో ఆదివారం తిరునాళ్లలో ఆర్టీసీ ఏర్పాట్లపై డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 13 డిపోల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి తిరునాళ్లకు హాజరయ్యే లక్షలాది యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. గతేడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ మార్గాల నుంచి ప్రయాణికులు ట్రాఫిక్ జామ్‌ల్లో ఇబ్బంది పడకుండా స్వామి వారిని దర్శించుకుని వెళ్లేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఘాట్‌రోడ్డు మార్గంలో ప్రయాణించే ప్రత్యేక బస్సులను వివిధ డిపోల నుంచి తిరునాళ్లకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 700 బస్సులను మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేక బస్సులుగా నడిపినట్టు తెలిపారు. ప్రత్యేకించి కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 200 బస్సులు, చిలకలూరిపేట డిపో నుంచి 120 బస్సులతో పాటు ఘాట్‌రోడ్డు మార్గానికి 40 బస్సులను వినియోగించినట్టు వివరించారు. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా గతంలో కంటే అదనంగా బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అనుమోలు వెంకయ్య చౌదరి, డిప్యూటీ సీటీఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఎంఈ గంగాధర్, ఆర్టీసీ డీఎం వి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.