ప్రయివేటు బస్సులతో రూ.లక్షల నష్టం
ప్రయివేటు బస్సులతో రూ.లక్షల నష్టం
Published Sun, Dec 11 2016 10:36 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి
రేపల్లె : ప్రయివేటు వాహనాలతో ఆర్టీసీకి రోజుకు రూ.30 లక్షల నష్టం వస్తోందని రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి చెప్పారు. రేపల్లె ఆర్టీసీ డిపోకు ఆయన ఆదివారం సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనియన్‌లకు అతీతంగా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఆర్టీసీ డిపోను లాభాల బాటలో నడిపించాలని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులకు సూచించారు. రహదారులు ఉన్న దూర, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మధ్యాహ్న సమయాల్లో ఉండే పాసింజర్‌లను బట్టి బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి పలు కూడళ్లలో ఆర్టీసీ పరిరక్షణ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 58 పరిరక్షణ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. పరిరక్షణ పాయింట్లలో ఆర్టీసీ సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ చార్ట్స్ ప్రకారం కొంత సమయం కేటాయించి పాసింజర్లు ఆర్టీసీ బస్సులు ఎక్కేలా కృషి చేయాలని కోరారు. ఆక్యుపెన్సీ, కేఎంపీఎస్‌లను సాధించడంలోనూ రాష్ట్రంలో జిల్లానే మొదటిస్థానంలో ఉందన్నారు. ఆర్టీసీపై నోట్ల ప్రభావం రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపై కొంత వరకు చూపినట్లు ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి చెప్పారు. నోట్ల రద్దుతో కొత్తనోట్లకు చిల్లర లేకపోవటం, నోట్ల కష్టాలతో ఆర్టీసీ ప్రయాణికులు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడంతో కొంత వరకు ఆదాయం తగ్గిందన్నారు. చిల్లర సమస్యను అధిగమించేందుకు ఆర్టీసీ ప్రయాణికులకు స్వైపింగ్ మిషన్‌లను డిపోల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 20 మిషన్‌లను ఏర్పాటు చేశామని, తొలిరోజు వాటి ద్వారా రూ.1.80 లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించారు. మరో 300ల మిషన్‌లు డిపోలకు తీసుకువచ్చి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. నరసరావుపేట డిప్యూటీ సీటీఎం సీహెచ్ వెంకటేశ్వరరావు, డీఏం జే.నాగేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement