
సాక్షి, విజయవాడ: అంతర రాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని చూస్తున్నామని వెల్లడించారు. 256 సర్వీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నడపాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి భేటీ అనంతరం స్పష్టత వస్తుందని చెప్పారు. (ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు)
వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ప్రోటోకాల్ తప్పక పాటిస్తామన్నారు. విభజన జరిగినప్పుడు ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ కాలేదని, దాని మీద కూడా చర్చ జరిగిందని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు.