కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదు చేస్తున్న ఆర్మీ లాన్స్‌నాయక్ శ్రీనివాసరావు
ఆర్మీలో ఆయనో లాన్స్‌నాయక్ ... అయితేనేం ఆయనకు కూడా తన భూములను రక్షించుకునేందుకు ముప్పుతిప్పలు పడాల్సిన దుస్థితి. దేశం కోసం ఆర్మీలో పని చేస్తున్నారన్న సానుభూతి కూడా లేకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. కోర్టులు ఆదేశించినా ఆక్రమణల చెరలో ఉన్న అతని భూములను పరిరక్షించాల్సింది పోయి 22ఏను అడ్డం పెట్టుకుని అతని జీవితంతో ఆటలాడు
కుంటున్నారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన పోలిరెడ్డి శ్రీనివాసరావు ఆర్మీలో లాన్స్ నాయక్‌గా పనిచేస్తున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన ప్రస్తుతం డెప్యుటేషన్‌పై ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లో ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లో సేవలందిస్తున్నారు. తన తండ్రి రాజుబాబు, పెదనాన్న అప్పలనాయుడు 1979లో గ్రామంలోని సర్వే నంబర్ 133లో మూడెకరాలు కొనుగోలు చేశారు. దాంట్లో 2.10 ఎకరాలను బీసీ కాలనీ నిమిత్తం ప్రభుత్వం సేకరించింది. ఆ మేరకు పరిహారం కూడా మంజూరు చేశారు. ఇక మిగిలిన 90 సెంట్లకు శ్రీనివాసరావు తండ్రి, పెదనాన్నల పేరిట ఇవ్వాల్సిన పట్టాదారు పాస్‌పుస్తకాలను వారు కొనుగోలు చేసిన వారి పేరిట జారీ చేశారు. ఆ పట్టాదారు పుస్తకాలను అడ్డంపెట్టుకుని వారు కోర్టుకెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కష్టపడి కొనుగోలు చేసిన భూమి కోసం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దాదాపు పదేళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత చివరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేశారు. వాటిని ఆధారం చేసుకుని మరో ఐదేళ్ల పాటు సాగిన వాదోపవాదాలనంతరం సివిల్ కోర్టు కూడా శ్రీనివాసరావు కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
మరొక వైపు ఈ భూముల్లోకి సదరు దొంగపట్టాలు పుట్టించిన వారు చొరబడి దాదాపు 12 సెంట్ల భూమిని కబ్జా చేశారు. మిగిలిన భూమి ప్రస్తుతం వీరి అధీనంలోనే ఉంది. కబ్జాకు గురైన భూములను కూడా పరిరక్షించుకునేందుకు ఆర్మీలో పనిచేస్తున్న లాన్స్‌నాయక్ శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. చివరకు 2017లో మిగిలి ఉన్న భూమినైనా పరిరక్షించుకుందామన్న ఉద్దేశంతో తన సోదరికి గిఫ్ట్‌డీడ్ రూపంలో రాసిచ్చేందుకు నర్సీపట్నం సబ్ రిజిస్ట్రే షన్ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఆసలు విషయం తెలిసి విస్తుపోవడం లాన్స్‌నాయక్ వంతు వచ్చింది. పోరాటం ఫలించిందనుకున్న సమయంలో తమ భూములు కాస్తా 22 ఏలో (నిషేధిత భూముల జాబితా) ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. దీంతో పోరాటం మళ్లీ మొదటికొచ్చింది. అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు చేసినా 22ఏ జాబితా నుంచి మోక్షం లభించలేదు. దీంతో చివరకు తమ ఆర్మీ కమాండెంట్‌కు ఫిర్యాదు చేశారు. కమాండెంట్ కూడా సీరియస్‌గా తీసుకుని తొలుత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయ్..అప్పటికీ న్యాయం జరగకపోతే కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అభయమిచ్చారు. ఆ మేరకు అనుమతినివ్వడమే కాదు సుబేదార్ గిరిదారిలాల్, సిపాయి బీడీ మహేష్‌కుమార్‌లతో శ్రీనివాసరావును కలెక్టరేట్‌కు పంపించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ భాస్కర్ సమగ్ర విచారణ జరపాల్సిందిగా పక్కనే ఉన్న జాయింట్ కలెక్టర్ జి.సృజనను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment