విజయనగరంఫోర్ట్: ఆరోగ్యమిత్రలు భయపడినట్లే జరిగింది. విద్యార్హతల పేరుతో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల తొలగింపు ప్రక్రియకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బుధవారం జీవో జారీ చేసింది. తక్షణమే జిల్లా మేనేజర్లను విధుల నుంచి తొలగించాలని ఈ జీవోలో పేర్కొంది. కో-ఆర్డినేటర్ మినహా అందరినీ ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన విద్యార్హతల ప్రకారం నియమించాలని సూచించింది. ఈ జీవో ప్రకారం కో-ఆర్డినేటర్ మినహా అందరినీ తొలగించినట్లేనని భావిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రోడ్డునపడనున్న మిత్రలు
జిల్లాలో 102 మంది పీహెచ్‌సీ మిత్రలు, 30 మంది నెట్‌వర్క్ మిత్రలు, ఒక నెట్‌వర్క్ టీమ్ లీడరు, మగ్గురు డివిజన్‌ల్ టీమ్ లీడర్లు, ఒక జిల్లా మేనేజర్, ఒక జిల్లా కో-ఆర్డినేటర్ పనిచేస్తున్నారు. జిల్లా మేనేజర్‌ను తక్షణమే విధుల నుంచి తొలిగించాలని, మిత్రలు, టీమ లీడర్లుగా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న వారిని నూతనంగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎనిమిదేళ్ల క్రితం ఆరోగ్యశ్రీ పథకంలో డిగ్రీ విద్యార్హతతో చేరిన వీరంతా రోడ్డున పడే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. దీంతో తమకు ఇక ఉద్యోగ అవకాశాలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పోరాటానికి సన్నద్ధం
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆరోగ్య మిత్రలు గురువారం నుంచి పోరాటానికి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వారు విధులు బహిష్కరించి ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని నిర్ణయించారు.
ఏమీ పాలుపోవడంలేదు
‘ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలిగించడం దుర్మార్గం. ఉద్యోగం ఉందని ఆశతో జీవిస్తున్నాం. ఉద్యోగం నుంచి తొలగిస్తే భార్య, పిల్లలతో ఏ విధంగా జీవించాలి. ఏమి చేయాలో పాలు పోవడంలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఉన్న ఉద్యోగాన్ని పీకేయడం అన్యాయం.
కె.మురళీధర్, ఆరోగ్యమిత్ర, విజయనగరం
మా పొట్టగొట్టడం తగదు
‘చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా ఉద్యోగం తీసేసి అన్యాయం చేస్తాడని ఊహించలేదు. జీతం తక్కువ ఇచ్చినా సరే కష్ట పడి పనిచేస్తున్నాం. జీతాలు పెంచుతారని ఆశిస్తున్న తరుణంలో ఉద్యోగం తీసేయడం దారుణం. మాలాంటి వారి పొట్టగొట్టడం ప్రభుత్వానికి తగదు.’
పి.లక్ష్మి, ఆరోగ్య మిత్ర, విజయనగరం
ఆరోగ్య మిత్రలపై వేటు !
Published Thu, Jan 21 2016 3:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
Advertisement
Advertisement