వ్యభిచార ముఠా గుట్టురట్టు
వ్యభిచార ముఠా గుట్టురట్టు
Published Tue, Mar 18 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
పెదకాకాని, న్యూస్‌లైన్: హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తూ విటులను నగ్నంగా ఫోటోలు తీసి.. వారిస్థాయిని బట్టి బ్లాక్‌మెయిల్ చేస్తూ సొమ్ము చేసుకునే ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు. పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన గోపు కృష్ణ అలియాస్ కృష్ణయ్య, పోకూరి లక్ష్మణాచారి అలియాస్ లక్ష్మణ్, గోపు ఉమలు ముఠాగా ఏర్పడి హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కృష్ణ తేలిగ్గా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వ్యభిచార వృత్తిని ఎంచుకొని కొనసాగిస్తున్నాడు. మహిళలతో పరిచయం పెంచుకుని తనకు తెలిసిన విటుల వద్దకు పంపింస్తుంటాడు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడొకరు కృష్ణకు పరిచయమయ్యాడు. ఆ వైద్యునికి అమ్మాయి ఉందని చెప్పి రూ.20 వేలు తీసుకున్నాడు. కృష్ణ పెదకాకాని సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఉంటున్న తన రెండో భార్య ఉమ వద్దకు ఆ వైద్యుడ్ని పంపించాడు. ఇద్దరూ లోపల ఉన్న సమయంలో ముందస్తు పథకంలో భాగంగా కృష్ణ, లక్ష్మణాచారిలు తలుపుకొట్టి లోపలకు వెళ్లారు. నగ్నంగా ఉన్న ఇద్దరి ఫొటోలు తీసి.. నా భార్య వద్దకు ఎందుకు వచ్చావంటూ లక్ష్మణాచారి బెదిరింపులకు దిగాడు. నగ్నంగా ఉన్న ఫొటోలను నీ భార్యకు పంపిస్తామని ఆ వైద్యుడ్ని బ్లాక్‌మెయిల్ చేసి రెండు విడతలుగా రూ.2.30 లక్షలు వసూలు చేశారు.
ఈ నెల ఒకటో తేదీ మళ్లీ ఆ వైద్యుడ్ని బెదిరించి రూ.22.70 లక్షలకు చెక్కులు రాయించుకున్నారు. దీంతో బాధిత వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పథకం ప్రకారం.. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.2.30 లక్షల నగదు, రూ.22.70లక్షలకు చెక్కులు, హుందాయ్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంతో చొరవచూపిన సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ ఏడీ కోటేశ్వరరావు, బెల్లంకొండ గురవయ్య, బుల్లిబాబు, కృష్ణ, శ్రీనులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ డి.సూర్యశ్రావణ్, సీఐ కె శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన కృష్ణపై ఇదే వ్యవహారంలో గుంటూరు, విజయవాడ, వినుకొండ పోలీసుస్టేషన్‌లలో పెండింగ్ కేసులు ఉన్నాయి. బాధిత వైద్యుడి పేరును పోలీసులు వెల్లడించలేదు.
Advertisement