ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
అనంతపురం టౌన్ : ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మేరకు సాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అరెస్టులో అపలేరని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సాగుతున్న హోదా ఉద్యమంలో భాగంగా గురువారం ఆ పార్టీ నేతలు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల దిష్టిబొమ్మలకు శవ యాత్ర నిర్వహించారు. పార్టీ శ్రేణులు నల్లవస్త్రాలు ధరించి తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి దిష్టిబొమ్మలను శవయాత్రగా టవర్‌క్లాక్ వరకూ తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే దిష్టిబొమ్మలను దహనం చేసి పిండ ప్రధానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, హోదాపై నాలుగేళ్లుగా నోరుమెదపని చంద్రబాబు.. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హోదా రాగం అందుకోవడం ఆయన స్వార్థ రాజకీయానికి నిదర్శనమన్నారు.
హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల దీక్షలతోనే టీడీపీ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలను గమనిస్తున్నారన్నారు. హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయ కర్త నదీమ్ అహమ్మద్ మాట్లాడుతూ, ప్యాకేజీకి మొగ్గు చూపిన చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడన్నారు. కేంద్రం నుంచి వైదొలిగినా...లోపాయికారి ఒప్పందాన్ని నేటికీ కొనసాగిస్తున్నాడన్నారు. అందులో భాగంగానే టీడీపీ ఎంపీలతో సైకిల్, బస్సు యాత్రల పేరిట డ్రామాలు ఆడిస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిష్టప్ప మాట్లాడుతూ, చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గౌస్‌బేగ్, విద్యార్థి విభాగం నేతలు నరేంద్రరెడ్డి, బిల్లే మంజునాథ్, గోపాల్‌మోహన్, రామచంద్రారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆదినారాయణరెడ్డి, కొర్రపాడు హుస్సేన్‌పీరా, చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు గిరిజమ్మ, జానకి, సాకే చంద్ర, సతీష్, బీసీసెల్ శ్రీనివాసులు, పసుపుల బాలకృష్ణారెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు క్రిష్ణవేణి, శోభ, సుజాత, రెడ్డెమ్మ, జాహ్నవి, రాజీవ్‌కాలనీ ప్రశాంతి, నాగలక్ష్మీ, జయమ్మ, లక్ష్మీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment