తుక్కుతో మెప్పు  | Artwork masterpieces with old iron and vehicle spare parts | Sakshi
Sakshi News home page

తుక్కుతో మెప్పు 

Published Mon, Nov 18 2019 3:42 AM | Last Updated on Mon, Nov 18 2019 3:42 AM

Artwork masterpieces with old iron and vehicle spare parts - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో / ఏఎన్‌యూ: ఇంట్లో తుప్పుపట్టిన పాత ఇనుప సామాను ఉంటే కేజీల లెక్కన అమ్మేస్తాం. కానీ కాదేది కళారూపాలకు అనర్హం అన్నట్లు ఆ పాత ఇనుముతోనే అద్భుత కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు కొందరు. అలాంటి వారిలో ఏఎన్‌యూ(ఆచార్య నాగార్జున యూనివర్సిటీ) ఆర్కిటెక్చర్‌ కళాశాల అధ్యాపకుడు పడకండ్ల శ్రీనివాస్‌ ఒకరు. తనలోని కళాజిజ్ఞాసతో వాహనాల్లోని పాత ఇనుమును కరిగించి, పనికిరాని విడిభాగాలు సేకరించి అందరి మెప్పు పొందేలా అందమైన వస్తువుల్ని సజీవ రూపాలుగా తీర్చిదిద్దుతున్నారు. తనతో పాటు మరో పదిమందిని సమీకరించి చెత్తతో స్క్రాప్‌ మెటల్‌ ఆర్ట్‌కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. 

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో..  
శ్రీనివాస్‌ బృందం తయారు చేసిన కళాకృతులు గుంటూరు, విజయవాడతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ పట్టణాలు, నగరాల్లో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. గుంటూరులోని బస్టాండ్‌ సమీపంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర, విజయవాడలోని పాత బస్టాండ్‌ రోడ్డులో, తాడేపల్లి కృష్ణా కెనాల్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట, విజయవాడ రైల్వేస్టేషన్‌ ఎదుట, మల్డీ డిసిప్లినరీ శిక్షణా కేంద్రంలో, విజయవాడ రైల్వేస్టేషన్‌ సెల్ఫీ పాయింట్‌తో పాటు ఏపీలోని అనంతపురం, కర్నూలులో శ్రీనివాస్‌ బృందం రూపొందించిన కళాకృతులు దర్శనమిస్తాయి. మధురై, తిరునల్వేలి, ట్యుటికొరిన్, తూత్తుకుడి ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చెన్నై అడయార్‌లో కూడా ఈ బృందం పనులు ప్రారంభిస్తోంది. 

ఆర్కిటెక్చర్‌ విద్యార్థులకు శిల్పకళపై అనేక మెలకువలు నేర్పుతున్నాను. పాత విద్యార్థులకు స్క్రాప్‌ మెటల్‌ ఆర్ట్‌లో శిక్షణ ఇస్తున్నాను. నాలో ఉన్న జిజ్ఞాసతో ఈ రంగం వైపు అడుగులు వేశాను. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా.. ఇప్పుడు నా కళకు ప్రాచుర్యం రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.   
- శ్రీనివాస్,  ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్‌ అధ్యాపకుడు 

ఎలా రూపొందిస్తారు? 
ఈ ఆర్ట్‌లో మొదట కళాకృతి సైజును నిర్ధారించుకుని.. పేపర్‌పై గీసి ఏ భాగం ఎంత సైజు ఉండాలో కొలతలు రాసుకుంటారు. అనంతరం కరిగించిన పాత ఇనుముతో పునాది (బేస్‌) తయారు చేస్తారు. ఆ తర్వాత ఇనుప పైపుల్ని వెల్డింగ్‌ చేస్తూ అనుకున్న రూపానికి తీసుకొస్తారు. దానిపై వాహనాల గేర్‌ వీల్స్, షాక్‌ అబ్జర్వర్స్‌ అమర్చి వెల్డింగ్‌ చేసి అందంగా మలుస్తారు. ఆ రూపాన్ని డీజిల్, కిరోసిన్‌తో శుభ్రపరుస్తారు. డ్యూకో పెయింట్‌తో అనుకున్న రంగు వచ్చే వరకు రెండు, మూడు సార్లు పెయింట్‌ వేస్తారు. చివరికి అద్భుత కళాకృతి ఆవిష్కృతమవుతుంది. శ్రీనివాస్‌ బృందం విజయవాడ కేంద్రంగా వీటిని రూపొందిస్తుంది. పాత బస్టాండ్‌ సమీపంలోని ఒక కర్మాగారంలో బృందంగా వీటిని తయారుచేస్తున్నారు. ఈ కళారూపాలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు పురస్కారాలు లభించాయి. 

విద్యార్థి దశ నుంచే ఆసక్తి 
స్క్రాప్‌ మెటల్‌ ఆర్ట్‌పై శ్రీనివాస్‌కు విద్యార్థి దశ నుంచే ఆసక్తి. 1998లో బెనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి శిల్పకళలో పీజీ చేశారు. 2010 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌లో అకడమిక్‌ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. అయితే స్క్రాప్‌ మెటల్‌ ఆర్ట్‌పై ఉన్న మక్కువ ఆయన్ను కుదురుగా ఉండనీయలేదు. ఫైన్‌ ఆర్ట్స్‌ మాజీ విద్యార్థులు 20 మందితో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి పాత ఇనుము, వాహనాల విడిభాగాలతో కళాఖండాలు రూపొందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement