వాస్తవ విరుద్ధంగా కేంద్ర బడ్జెట్
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ విరుద్దంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ ప్రజలు ఆశించినంత స్థాయిలో బడ్జెట్ లేదన్నారు. 2.45 లక్షల కోట్ల ద్రవ్యలోటును చూసిస్తూ సంవత్సరం మొత్తానికి 5.31 లక్షల కోట్లు ఉంటుందని చెప్పడం సరికాదన్నారు.
రెండు నెలల్లో వ్యయం 2.80 లక్షల కోట్లు ఉంటే దీనికి సమాంతరంగా ఆదాయం కూడా రావాలని,35వేల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందన్నారు. మిగతా సొమ్ము అప్పుగా తెచ్చి వాడుతారని, దీనిని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో ప్రజలపై పన్నుల వడ్డన తప్పదన్నారు.
కేంద్ర బడ్జెట్ వలన రాష్ట్రానికి ఏ ప్రయోజనం కలుగలేదని, హామీలే తప్ప నిధుల కేటాయింపు శూన్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి *4.5 లక్షల కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారని, కానీ బడ్జెట్‌లో దాని ప్రస్తావన లేదన్నారు. రాయలసీమలో నాలుగు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పారని, బడ్జెట్‌లో దీనిపై ప్రస్తావించలేదన్నారు.
రైతులకు రుణమాఫీ అంటే రీషెడ్యూలు చేయడమా అని బాబును ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు గానీ ఆయన మంత్రులు గానీ జిల్లాల్లో
పర్యటిస్తే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురుకాక తప్పదన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజల కోసం వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోరాటం చేయడానికి సిద్ధమన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తమ్మినేని చిరంజీవినాగ్, మొదలవలస లీలామోహన్, ఎ.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.