
హోదా కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలి
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సూచన
విజయవాడ (లబ్బీపేట): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయ పార్టీలకతీతంగా సమైక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రశిఖ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షోరూమ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసిందని, ఆ సమయంలో కొన్ని అంశాలను పేర్కొనడంతోపాటు హామీలు ఇచ్చిందన్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విభజన అంశాలను, హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలకు ఇస్తున్న ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్‌కు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారినా పార్లమెంటులో చేసిన చట్టాలను అమలుచేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారిపై ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.