నవ్యాంధ్రలో నంబర్ వన్ | As the financial capital of the Visakhapatnam | Sakshi
Sakshi News home page

నవ్యాంధ్రలో నంబర్ వన్

Published Tue, Jan 27 2015 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

నవ్యాంధ్రలో నంబర్ వన్

నవ్యాంధ్రలో నంబర్ వన్

త్వరలో ఆర్థిక రాజధానిగా విశాఖ
అభివృద్ధివైపు శరవేగంగా అడుగులు
స్మార్ట్ సిటీతో విశాఖకు ఉజ్వల భవిష్యత్
ఐఐఎం, బిట్స్ పిలానీలతో అంతర్జాతీయ హోదా
విశాఖకు రానున్న వేల కోట్ల పెట్టుబడులు
త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో రైలు ప్రాజెక్టు
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ యువరాజ్ వెల్లడి

 
‘నవ్యాంధ్రలో విశాఖ జిల్లాకు విశిష్ట స్థానం ఉంది. అమెరికా సౌజన్యంతో నగరం స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుంది. మెట్రో రైలు ప్రాజెక్టు, ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ ఐఐఎం, బిట్స్‌పిలానీ, సరళ-బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ కార్యరూపం దాల్చనున్నాయి. విశ్వనగరంగా విశాఖకు ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’
         - డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్  
 
విశాఖపట్నం: పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖ జిల్లా నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధానిగా త్వరలో ఆవిర్భవించనుందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. భారతదేశానికే ఆర్థిక రాజధాని కాగల సత్తా ఉన్న ఏకైక జిల్లా విశాఖ అని తెలిపారు. అభివృద్ధిలో శరవేగంగా పరుగులు తీయనున్న జిల్లాకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. 66వ గణతంత్ర వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్థానిక పోలీస్ బేరెక్స్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్రలో విశాఖ జిల్లాకు విశిష్ట స్థానం ఉందన్నారు. అమెరికా సౌజన్యంతో నగరం స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుందన్నారు. జిల్లాలో సగం జనాభా జీవీఎంసీ పరిధిలోనే నివసిస్తున్నందున, నగరంలో ట్రాఫిక్, కాలుష్య సమస్యలను అధిగమించేందుకు మెట్రో రైల్వే ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు అప్పగించారని, ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు నగరంలో పర్యటిస్తూ డీపీఆర్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారన్నారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థకు పునాది రాయి పడిందని, త్వరలో బిట్స్‌పిలానీ, సరళ-బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కార్యరూపం దాల్చనున్నాయన్నారు. ఏయూ కేంద్రంగా ఐఐఎం తరగతులు రానున్న విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలు చూస్తున్నాయన్నారు. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రగతిపథాన నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. విద్య, పారిశ్రామిక, పర్యాటక, ఐటీ రంగాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారా విశ్వనగరంగా విశాఖకు ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా అరకు మండలం పెదలబుడు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకోగా, కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు సైతం గ్రామాలను దత్తత తీసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించిన జన్మభూమి మావూరు కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 3లక్షలకు పైగా వినతులొచ్చాయని, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జన్‌ధన్‌యోజనలో జిల్లాలో 5లక్షల బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 2.52 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. మార్చి చివరి నాటికి ఆధార్ సీడింగ్ నూరు శాతం పూర్తి చేసి అన్ని పథకాలకు వర్తింప చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 50వేల లోపు రుణాలున్న రైతులకు ఒకేసారి మాఫీ చేయడం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1.25లక్షల రైతులకు తొలి విడతలో 157.18కోట్ల రుణమాఫీ సొమ్ము జమ చేశామన్నారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి తద్వారా 1833 అవాసాలకు మంచినీరు అందించే లక్ష్యంతో రూ.47.27కోట్లతో ప్రతిపాదనలు రూపొందిం చామన్నారు. గతేడాది అక్టోబర్ 12వ తేదీన హుద్‌హుద్ రూపంలో విరుచుకుపడిన పెనుతుపాను జిల్లా ప్రజలంతా మొక్కవోని ధైర్యంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగారన్నారు. ఈ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన సుమారు నాలుగున్నర లక్షల మంది బాధితులకు రూ.381.75 కోట్ల మేర పరిహారం అందజేశామన్నారు. జిల్లాలో 11 ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించగా, ఇప్పటి వరకు 42,893 క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మడం ద్వారా రూ.2.14 కోట్లఆదాయం వచ్చిందన్నారు. 4,619 డ్వాక్రా సంఘాలకు  రూ.136.64కోట్ల బ్యాంక్ లింకేజ్ అందజేశామన్నారు.
 
లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ

ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాల ద్వారా పలువురు లబ్ధిదారులకు రూ.100.96కోట్ల మేర ఆస్తులను 43,876 మందికి కలెక్టర్ యువరాజ్ పంపిణీ చేశారు. డీఆర్‌డీఏ ద్వారా 3975 డ్వాక్రా సంఘాల పరిధిలోని 43,725 మందికి రూ.100కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్‌ను అందజేశారు. ఉమెన్‌అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, డిజిబుల్డ్ వెల్ఫేర్ శాఖల పరిధిలో 151మంది లబ్ధిదారులకు రూ. 96.42లక్షల విలువైన ఎసెట్స్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నగర పోలీస్‌కమిషనర్ అమిత్‌గార్గ్, జేసీ జనార్ధన్ నివాస్, డీఆర్‌వో కె.నాగేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement