ఆర్చరీ మెరుపులు
- విజయవాడ చేరుకున్న పూర్వాష, జ్యోతిసురేఖ
- ఏషియన్ గేమ్స్ పతక విజేతలకు ఘనస్వాగతం
విజయవాడ స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్‌లో బెజవాడ కీర్తిపతాకను ఎగురవేసి నగరానికి వచ్చిన ఆర్చర్లకు ఘనస్వాగతం లభించింది. ఇంచియాన్ (కొరియా)లో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో విజయవాడ నుంచి భారత కాంపౌండ్ మహిళా ఆర్చరీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు సాధించిన పూర్వాష, వెన్నం జ్యోతి సురేఖ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం పూర్వాష తన కోచ్ ఎల్.చంద్రశేఖర్‌తో కలిసి గన్నవరం చేరుకోగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పి.రామకృష్ణ, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు, క్రీడాసంఘాల ప్రతినిధులు నామిశెట్టి వెంకట్, డి.శ్రీహరి, శాతవాహన కళాశాల పీడీ సంగీతరావు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అర్చర్లతో పాటు పూర్వాష చదువుకున్న విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ర్యాలీగా నగరానికి చేరుకున్నారు. ఏపీ ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ, విజయవాడ ఓల్గా అకాడమీ ఆర్చర్లు తప్పకుండా పతకాలు సాధిస్తారని ముందుగానే చెప్పామని, అదిప్పుడు నిజమైందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో సీఎంను కలిసిన సురేఖ
భారత జట్టుతో శుక్రవారం ఢిల్లీ వచ్చిన మరో ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అక్కడ్నుంచి హైదరాబాద్‌కు చేరుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శనివారం నగరానికి చేరుకుంది. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, క్రీడాసంఘాలు, సహచర ఆర్చర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘనస్వాగతం పలికారు. జ్యోతి సురేఖకు సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సీబీఆర్ ప్రసాద్ రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
1951 ఢి ల్లీలో జరిగిన తొలి ఏషియన్ గేమ్స్‌లో కృష్ణా జిల్లాకు చెందిన కామినేని ఈశ్వరరావు, దండమూడి రాజగోపాలరావు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించగా.. ఇన్నేళ్ల తరువాత జ్యోతి సురేఖ కాంస్య పతకం సాధించిందన్నారు. ఆమెకు ఏ విధమైన సహకారం కావాలన్నా అందిస్తానని ప్రసాద్ హామీ ఇచ్చారు. జ్యోతిసురేఖ వెంట తండ్రి సురేంద్ర, డీఎస్‌డీవో పి.రామకృష్ణ, కేఎల్‌యూ డెరైక్టర్ రామకృష్ణ, శాయ్ కోచ్ వినాయకప్రసాద్, సెపక్‌తక్రా అసోసియేషన్ అధ్యక్షుడు అర్జా పాండురంగారావు ఉన్నారు.