వెలుగులో వచ్చిన ఏఎస్పీ శశికుమార్ సూసైడ్ నోట్
మూడు నెలలుగా వైఫల్యాలు, ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు దానిలో వెల్లడి
అవి ప్రాణం తీసుకునేంత తీవ్రమైనవా?
ఏఎస్పీది ఆత్మహత్యేనని ప్రాథమికంగా తేల్చిన సీఐడీ
పాడేరు/ సాక్షి, విశాఖపట్నం: మృతి చెందిన పాడేరు ఏఎస్పీ టేబుల్‌పై లభించిన చివరి లేఖలో పచ్చ ఇంకుతో రాసిన ఈ వాఖ్యాలు.. ఆయనది ఆత్మహత్యేనని చెబుతున్నాయి. అయితే విధి నిర్వహణలో ఆయనకు ఎదురైన వైఫల్యాలు ఏమిటి?.. అవి డిప్రెషన్‌కు, చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించేంత తీవ్రమైనవా??.. అన్నది విచారణలో తేలాల్సిన అంశాలు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించడంతో ఆ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విచారణాధికారిగా నియమితులైన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తన బృందంతో గురువారం రాత్రే విశాఖ నుంచి పాడేరుకు వెళ్లారు. ఉదయం దుర్ఘటన జరిగిన పాడేరులోని ఏఎస్పీ కార్యాలయాన్ని ఆయన మరో నలుగురు సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. పాడేరు మండలానికి చెందిన ఇద్దరు వీఆర్వోలు గణపతమ్మ, విజయ్ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. అలాగే క్లూస్ టీం చెందిన నలుగురు అధికారులు ఏఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి సంఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించారు. అనంతరం సీఐడీ బృందం సంఘటన స్థలాన్ని సుమారు రెండు గంటల సేపు అణువణువూ పరిశీలించింది. సంఘటన స్థలంలో పడి ఉన్న రివాల్వర్, ఏఎస్పీ డైరీ, సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు చింతపల్లి డీఎస్పీ విచారణ
మరోవైపు చింతపల్లి డీఎస్పీ రాఘవేంద్ర కూడా వచ్చి ఏఎస్పీ కార్యాలయ సిబ్బందిని విచారించారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించే హోంగార్డ్స్, గన్‌మెన్లు, స్వీపర్లు, సంఘటన జరిగినప్పుడు ఉన్న సిబ్బందిని ఆయన విడివిడిగా పిలిపించి వివరాలు సేకరించారు. కాగా ఏఎస్పీ శశికుమార్ బంధువర్గానికి చెందిన ఇద్దరు గురువారం రాత్రి ఆయన నివాస గృహానికి వచ్చి వెళ్ళినట్లు తెలిసింది. ఏఎస్పీ రాసిన సూసైడ్ నోట్‌ను గుర్తించామని, దానిలో కుటుంబానికి సంబంధించిన పలు సున్నితమైన అంశాలు ఉన్నందున అతని తల్లిదండ్రుల అనుమతితోనే తెరుస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంఘటన జరిగిన రోజు రాత్రి ప్రకటించారు. కాగా ఆ లేఖను సీఐడీ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోల సమక్షంలో దాన్ని తెరిపించి చదివించ గా.. శశికుమార్‌ది ఆత్మహత్యేనని అందులోని అంశాలు దాదాపుగా స్పష్టం చేశాయి. తీవ్ర డిప్రెషన్‌కు గురికావడం వల్లే శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు లభించిన ప్రాథమిక ఆధారాల(సీన్ ఆఫ్ అఫెన్స్)ను బట్టి తెలుస్తోందని సీఐడీ డీఎస్పీ నాయుడు కూడా సాక్షికి వెల్లడించారు. కాగా కేజీహెచ్‌లో ఉన్న శశికుమార్ మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ వెంటనేనర్శీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ దగ్గరుండి విమానంలో శశికుమార్ మృతదేహాన్ని, ఆయన తల్లిదండ్రులను స్వస్థలానికి పంపించారు.