20లోగా అసెంబ్లీ సమావేశాలు: శ్రీధర్‌బాబు
అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 20లోగా జరుగుతాయని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ప్రొరోగ్‌కు సంబంధించి తాను సీఎంను ఎదిరించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రొరోగ్‌కు సంబంధించిన ఫైలు తన వద్దకు వచ్చిందని, అయితే దాన్ని చూడలేదన్నారు. తన వద్దకు ఎన్నో ఫైళ్లు వస్తుంటాయని, చూశాకే వాటిని క్లియర్ చేస్తుంటానన్నారు.
అసలు ప్రొరోగ్ అన్నది చాలా చిన్న విషయమని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్‌లు అవసరమైనప్పుడు అలాంటి వాటికి ఆస్కారం ఉంటుందన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలని అధిష్టానానికి, జీవోఎం దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లామన్నారు. రాయల తెలంగాణ అన్నది ఉండదని, సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే విభజన బిల్లు ఉంటుందన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయటం లాంటిది ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుల మార్పులకు సంబంధించి కథనాలు వస్తున్నాయని, తమ జిల్లా పార్టీ అధ్యక్షుడి మార్పు అంశంపై చర్చించడానికే బొత్సతో భేటీ అయినట్టు తెలిపారు.