అసెంబ్లీ, మండలిలో గందరగోళం, సభలు అరగంట పాటు వాయిదా
రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సీట్లన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి. మొత్తం సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. పరస్పరం పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఒకవైపు జై సమైక్యాంధ్ర అంటూ కొందరు, మరోవైపు జై తెలంగాణ అంటూ మరికొందరు నినిదాలు చేశారు. మొత్తం అన్ని పార్టీల సభ్యులూ పోడియం వద్దే ఉన్నారు.
సమైక్యాంధ్ర కోసం వైఎస్ విజయమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానం సహా పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ మనోహర్ తిరస్కరించారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు.
మరోవైపు మండలిలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. చైర్మన్ చక్రపాణి సభను అదుపులోకి తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం కనిపించలేదు. దాదాపు మండలి సభ్యులంతా పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో చైర్మన్ మండలిని కూడా అరగంట పాటు వాయిదా వేశారు.