భూమా నాగిరెడ్డికి శాసనసభ నివాళి
⇒ సభలో సంతాప తీర్మానం
⇒ తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తా: అఖిల ప్రియ
సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి శాసనసభ మంగళవారం నివాళులు అర్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. నాగిరెడ్డి మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించిన అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమవుతూనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి మేరకు చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ భూమా జీవిత విశేషాలను వివరించారు. చనిపోవడానికి 24 గంటల ముందు భూమా తనను విజయవాడలో కలిశారని, నియోజకవర్గ సమస్యలపై చర్చించారని, ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. నాగిరెడ్డి గుండె ధైర్యం, అంకిత భావం కలిగిన నాయకుడని కొనియాడారు.
మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే తల్లి, తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే అఖిల ప్రియ, ఆమె చెల్లెలు, తమ్ముడికి అండగా ఉంటామని, కన్నతండ్రిలాగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటిని తరలించే పైప్‌లైన్ ప్రాజెక్టుకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టడానికి అభ్యంతరమేమీ లేదని తెలిపారు. వ్యక్తులు వేరు, రాజకీయాలు వేరంటూ శివారెడ్డి, పరిటాల రవి హత్యోదంతాలను చంద్రబాబు ప్రస్తావిం చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తాము సహకరించామని అన్నారు.
డాక్టర్లు వారించినా విజయవాడ వచ్చారు
తన తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తానని, వారి ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భూమా దంపతుల కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ చెప్పారు. తన తండ్రి నాగిరెడ్డి ఆసుపత్రిలో బెడ్‌పై ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారని తెలిపారు. ప్రయాణం చేయవద్దని డాక్టర్లు వారించినా విజయవాడకు వచ్చి సీఎం చంద్రబాబును కలసి వెళ్లారన్నారు. తనకు మార్గదర్శకుడు తన తండ్రేనని, తన తల్లి చనిపోయిన పడక మీదనే తండ్రి కూడా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా బడుగువర్గాల కాలనీకి, రహదారి విస్తరణకు, నంద్యాల పైప్‌లైన్‌కు ఆయన పేరు పెట్టాలని కోరారు. బాధను కసిగా మార్చుకుని పని చేస్తానన్నారు. భూమా కుటుంబంతో తనకు 25 ఏళ్లుగా పరిచయం ఉందని స్పీకర్ కోడెల చెప్పారు.