సాక్షి, ఆత్రేయపురం(తూర్పుగోదావరి) : మండలంలో పలు గ్రామాల్లో విలువైన లంక భూములు నదీపాతానికి గురవుతున్నాయి. తద్వారా ఏటిగట్లు పటిష్టతకు విఘాతం ఏర్పడుతుందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో బొబ్బర్లంక వద్ద గౌతమీ కుడిగట్టు, వశిష్టా ఎడమగట్టు ప్రాంతంలో లంక భూములు కోతకు గురవుతున్నాయి. అలాగే తాడిపూడి, వసంతవాడ, పులిదిండి, రాజవరం గ్రామాల్లో సైతం లంక భూములు అండలు జారి కనుమరుగవుతున్నాయి. ఈ భూముల్లో ఎందరో పేద రైతులు అరటి తదితర పంటలను పండించుకుని జీవనోపాధి పొందుతున్నారు.
వెంటనే లంక భూములు కోతకు గురి కాకుండా గ్రోయిన్లు నిర్మించి పట్టిష్టతకు చర్యలు చేపట్టాలని ఈప్రాంత రైతులు కోరుతున్నారు. అలాగే గతంలో ఏటిగట్ల ఆధునికీకరణ పనుల్లో భాగంగా మండలంలో పేరవరం, వద్దిపర్రు, ఆత్రేయపురం, మెర్లపాలెం తదితర ప్రాంతాల్లో పనులు చేపట్టకపోవడంతో గట్లు బలహీనంగా ఉన్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గట్లపై గతంలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలించుకోవడానికి రోడ్లు అనువుగా ఉండేవి. కానీ ఇటీవల ఆధునికీకరణ పనుల అనంతరం ఏటిగట్లపై కనీసం నడవడానికి సైతం అనుకూలంగా లేవు. సుమారు 12 ఏళ్లుగా వరదలకు లంక భూములు నదీ కోతకు గురి కావడంతో విద్యుత్ మోటార్లతో పాటు కొబ్బరిచెట్లు నదికోతకు గురై నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు మండలంలో సుమారు 300 ఎకరాల లంక భూములు నదీపాతానికి గురైనట్టు సమాచారం. అనేకసార్లు వరసగా వచ్చిన వరదలతో ఆత్రేయపురం మండంలో పలు గ్రామాల్లో లంక భూములు కోతకు గురై పంట పొలాలు గోదావరిలో కలిసిపోయాని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సారవంతమైన, ఉద్యాన పంటలు పండే భూముల్ని నదీపాతానికి గురికాకుండా ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతకు గురైన చోట గ్రోయిన్లు ఏర్పాటు చేసి ఏటిగట్లకు గ్రావెల్‌రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment