చెల్లిని వేధిస్తున్నారని..! | attack with axe on sister’s lover in kurnool | Sakshi
Sakshi News home page

చెల్లిని వేధిస్తున్నారని..!

Published Wed, May 3 2017 1:31 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేంద్ర

ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేంద్ర

- యువకుడి గొంతు కోసిన బాధితురాలి సోదరులు
- పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
 
‘మా చెల్లికి నిశ్చితార్థమైంది. రేపోమాపో అత్తారింటికి వెళ్తోంది. ఇక ఆమెను వేధించొద్దు’ అని యువతి సోదరులు తమ చెల్లిని వేధిస్తున్న యువకుడిని వేడుకున్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తరచూ వారి ఇంటి వైపు వస్తుండటంతో జీర్ణించుకోలేక పోయారు. ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని కాపుకాశారు. బలవంతంగా లాకెళ్లి దారుణంగా గొంతు కోశారు. యువకుడు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బుధవారం ఆలూరులో చోటు చేసుకుంది. 
- ఆలూరు రూరల్‌
  
 ఆలూరు ఎస్సీ కాలనీకి చెందిన సురేంద్ర అదే కాలనీకి చెందిన ఓ యువతిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. వెంటపడి తననే పెళ్లి చేసుకోవాలని భయాందోళనకు గురి చేశాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు, అన్నలకు చెప్పింది. దీంతో వారు యువకుడిని యువకుడిని మందలించారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. అయినా సురేంద్ర ఆ యువతిని వేధిస్తుండటంతో పాటు పెళ్లి కూడా కాకుండా చూస్తానని హెచ్చరించాడు. దీంతో అతనిపై కక్ష్య కట్టిన ఆ యువతి సోదరులు జగన్, నాగరాజు నెల క్రితమే సురేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు. విషయం తెలుసుకున్న సురేంద్ర తల్లిదండ్రులు తమ కుమారుడిని బెంగళూరుకు వలస పంపారు. కాగా ఇటీవల బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న సురేంద్ర సోదరుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న అంత్యక్రియలకు హాజరైన సురేంద్ర తిరిగి బెంగళూరుకు వెళ్లకుండా గ్రామంలోనే ఉండి మళ్లీ యువతిని వేధించ సాగాడు. తరచూ  ఆమె ఇంటి ముందే తిరుగుతుండడంతో జగన్, నాగరాజు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఎలాగైనా అతడిని చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు సురేంద్ర బహిర్భూమికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో  ఆదిఆంధ్ర పాఠశాలోనికి సురేంద్రను బలవంతంగా లాక్కెళ్లారు. ముందుగానే అక్కడ ఉంచిన కత్తితో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో చనిపోయాడని భావించి నిందితులు వెళ్లిపోయారు. కొద్ది సేపటికి సమాచారం అందుకున్న యువకుడి తల్లి, బంధువులు అక్కడికి చేరుకుని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సురేష్‌ను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు పంపారు. ఆలూరు ఎస్‌ఐ ధనుంజయ, పోలీసులు సురేంద్ర తల్లి మారెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement