ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్ : క్రికెట్ మ్యాచ్‌లు మొదలయ్యాయంటే చాలు పోలీసులు హడావుడి కనిపిస్తుంది. ప్రధాన సెంటర్‌లతో పాటు పలు బెట్టింగ్ స్థావరాలలోనూ, బుకీల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తారు. దీంతో పోలీసుల దాడులు ఉంటాయేమోనని పసిగట్టిన బుకీలు ప్రొద్దుటూరు వదలి వెళ్లే వారు.
ఇది ఒకప్పటి మాట. కానీ ఇపుడు పోలీసుల దాడులు లేవు..భయపడి ఎక్కడికో దూరంగా పారిపోయే బుకీలు లేరు. క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయంటే ‘బుకీలకు ఇది మామూలే లే’ అని ఇక్కడి పోలీసు అధికారులు భావించడంతో క్రికెట్ బెట్టింగ్ అనేది సర్వసాధారణమైంది. వారం రోజుల నుంచి చాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గతంలో పట్టణంలో ఉన్న ప్రధాన బుకీలతో పాటు సబ్ బుకీలు కూడా మ్యాచ్‌ల సమయంలో హైదరాబాద్, చెన్నై, తిరుపతి, బెంగుళూరు లాంటి న గరాలకు వెళ్లి బెట్టింగ్ నిర్వహించేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. కొన్ని రోజుల క్రితం కొందరు పేరు మోసిన బుకీలు మాత్రమే బయటి ప్రాంతాలకు వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. మరి కొందరు ప్రధాన బుకీలు, సబ్ బుకీలతో పాటు కొరియర్‌లు కూడా ఇక్కడే ఉంటూ విచ్చలవిడిగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన టీ దుకాణాలతో పాటు కూడళ్లలో బుకీల హడావుడి కనిపిస్తుంటుంది. వీరు బహిరంగంగానే లావాదేవీలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటే అతిశయోక్తి కాదు.
బుకీలకు రాజకీయ అండ
ప్రొద్దుటూరు బుకీలకు రాజకీయ అండ పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ప్రధాన బుకీ వెనుక ఒక రాజకీయనాయకుడు ఉన్నాడని పోలీసు వర్గాల సమాచారం. గాంధీరోడ్డులో ఉన్న ఓ ద్వితీయశ్రేణి నాయకుడు కొందరు బుకీలకు అభయ‘హస్తం’ ఇస్తున్నట్లు సమాచారం. అతను ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు కూడా సంబంధిత బుకీల జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.
అతని అండతోనే బుకీలు పట్టణంలోనే ఉంటూ విచ్చలవిడిగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకైతే పట్టణంలోని పోలీసులు ప్రధాన బుకీల స్థావరాలు కనిపెట్టి దాడులు నిర్వహించేవారు. అయితే ఇటీవల కాలంలో కొందరు కానిస్టేబుళ్లకు రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో కానిస్టేబుళ్లు బుకీలను పట్టుకోవడానికి సాహసించలేకపోతున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
జోరుగా బెట్టింగ్
Published Wed, Oct 2 2013 2:43 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement