అంబాజీపేట :పాత కక్షల నేపథ్యంలో మండలంలోని చిరతపూడి సొసైటీ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటేశ్వరరావుపై సోమవారం హత్యాయత్నం జరిగింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనపై అమలాపురం సీఐ జి.దేవకుమార్ కథనం ప్రకారం.. చిరతపూడి సొసైటీ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటేశ్వరరావు సొసైటీలో విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఇసుకపూడి మోటారుసైకిల్‌పై వస్తున్నారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావును ఆటో వెంబడించింది. ఇసుకపూడి మలుపు వద్దకు వచ్చే సరికి ఆటో వెంకటేశ్వరరావును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
దీంతో వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. ఆటో నడుపుతున్న సాధనాల కుమార్ కత్తితో పడిపోయిన వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. వెంకటేశ్వరరావు కత్తిపోటును తప్పించుకునే యత్నంలో ఎడమచేతి చిటికిన వేలుకు తీవ్ర గాయమైంది. వెంకటేశ్వరరావు కుమార్‌తో పెనుగులాడుతూ కేకలు వేయడంతో నింది తుడు కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాది నెహ్రూ ఇంట్లో తలదాచుకున్నాడని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. కొంతకాలంగా నెహ్రూ వర్గానికి వెంకటేశ్వరరావు వర్గానికి పాతకక్షలు ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి సోమవారం ఇసుకపూడి వచ్చిన కుమార్ హత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. ఘటనా ప్రదేశాన్ని పరిశీలించామన్నారు. దాడికి ఉపయోగించిన ఆటో, కత్తితోపాటు పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
పరారీలో నిందితుడు
హత్యాయత్నానికి పాల్పడిన సాధనాల కుమార్ పరారీలో ఉన్నాడని సీఐ దేవకుమార్ తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడు కుమార్ కోసం గాలిస్తున్నాయన్నారు. హత్యాయత్నానికి కారణాలు ఏమిటి, ఎంత మంది ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ వివరించారు.
పోలీస్ పికెట్ ఏర్పాటు
ఈ నేపథ్యంలో ఇసుకపూడిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని సీఐ వివరించారు. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ పికెట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయినవిల్లి, అల్లవరం ఎస్సైలు, మరో ఆరుగురు సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేశామన్నారు.
సొసైటీ అధ్యక్షుడిపై హత్యాయత్నం
Published Tue, Jun 2 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement
Advertisement