
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రవేశాల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారి విద్యార్ధులు తీవ్ర ఆందోళనలో ఉంటే.. ఇవేమీ పట్టించుకోకుండా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు విదేశీ పర్యటనకు పయనమవుతున్నారు. ఆసెట్ ప్రవేశాల ప్రక్రియ తప్పులు తడకలతో ఇప్పటికే వివాదాలు రేపగా.. తాజాగా బోధనేతర ఉద్యోగ నియామకాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వివాదాస్పదమవుతోంది. ఈ కీలక తరుణంలో దగ్గరుండి అన్నీ చక్కదిద్దాల్సిన వీసీ ఈనెల 21న స్వీడన్ పర్యటనకు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే నెల వీసీ పదవీకాలం ముగియనుంది. దానికి సరిగ్గా నెలరోజుల ముందు ఆయన స్వీడన్ పర్యటన వల్ల వర్సిటీకి ఒరిగేదేమిటని ఆచార్యులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. డిగ్రీ ఫలితాల విడుదలలో జాప్యం, సకాలంలో ఫలితాలు ఇవ్వకుండానే ఆసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం, వాటి ర్యాంకుల కేటాయింపు, కళాశాలలు అలాట్ చేయడం వంటి సవాలక్ష సమస్యల్లో ఏయూ మునిగిపోయిన తరుణంలో వీసీ తీరు, విదేశీ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
⇒ వరప్రసాద్ అనే విద్యార్థికి ఎంఈడీలో ప్రవేశం లభించినట్లు మంగళవారం వెబ్‌సైట్‌లో కనిపించింది. బుధవారం ఫీజు చెల్లించేందుకు వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రవేశం పొందలేదని చూపించింది. దాంతో సదరు విద్యార్థి లబోదిబోమంటూ ప్రవేశాల డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు.
⇒ మరో విద్యార్థి వెంకట రఘురామ్ అప్లయిడ్ జియాలజీ కోర్సులో ప్రవేశం పొందాడు. ఉదయం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాడు. దాని చలానా ప్రింట్ తీయడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. మళ్లీ ఫీజు చెల్లించాలన్న సందేశం అతన్ని వెక్కిరించింది. అంతే.. సదరు విద్యార్థి, అతని తండ్రి ప్రవేశాల సంచాలకుడి కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించే ప్రయత్నం చేశారు.
⇒ ఇలా ఒకరిద్దరు కాదు.. పెద్ద సంఖ్యలో విద్యార్థులు సీట్ల కేటాయింపు, ఫీజుల చెల్లింపు సమస్యలతో అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. ఈ ప్రక్రియ బాధ్యతలు చూస్తున్న క్యాంపస్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రతినిధులు వీరికి సమాధానాలు ఇవ్వలేక తలలు పట్టుకుంటున్నారు.
రూ.కోట్లు సమర్పించేశారు
ఆసెట్ ప్రవేశాల నిర్వహణ కాంట్రాక్టు కింద సదరు సంస్థకు ఏడాదికి రూ.5 నుంచి రూ.7 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. ఇంత అధిక మెత్తంలో చెల్లించినా సదరు సంస్థ ఆ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. ఎంసెట్ వంటి పరీక్షలు, కౌన్సెలింగ్‌లు నిర్వహించే ప్రముఖ సంస్థలను కాదని సీఎంఐకి అప్పనంగా కాంట్రాక్ట్ అప్పగించడం వెనుక లోగుట్టు ఏమిటో అర్ధం కావడం లేదు.
నిపుణుల సూచనలు స్వీకరించారా?
వర్సిటీకి చెందిన సమాచార సాంకేతిక అంశాల నిర్వహణ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీఎంఐకి ఆటోమేషన్ కాంట్రాక్టు ఇచ్చే ముందు ఆ సంస్థ సామర్థ్యాన్ని, గత అనుభవాన్ని ఏయూ ఉన్నతాధికారులు పరిశీలించారా అనే సందేహం వ్యక్తం అవుతోంది. వర్సిటీలోని అనుభవజ్ఞులైన కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యుల సూచనలు స్వీకరించారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సీఎంఐకి కట్టబెట్టడమన్నది వీసీ ఏకపక్ష నిర్ణయమా.. పాలకవర్గ సమష్టి నిర్ణయమా తెలియదు కానీ.. మొత్తంగా ఏయూ వర్గాలు విమర్శల పాలవున్నాయి.
చేతులెత్తేసిన నిర్వహణ సంస్థ
విద్యార్ధుల అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే విషయం స్పష్టమవుతోంది. అడ్మిషన్ల ప్రక్రియ బాధ్యతను దక్కించుకున్న బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్‌మెంట్ ఇంటర్నేషనల్(సీఎంఐ) సంస్థకు ఈ వ్యవహారాల్లో ఎటువంటి అనుభవం లేదని, తొలిసారిగా ఏయూపై ఈ సంస్థ ప్రయోగాలు చేసిందనే విషయం తేటతెల్లమవుతోంది. ఇదే సంస్థకు ఏయూ మొత్తాన్ని ఆటోమేషన్ చేసే కాంట్రాక్ట్‌ను ఇవ్వాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ణయించారు. ప్రవేశాల ప్రక్రియనే గందరగోళం చేసిన సంస్థకు ఏకంగా వర్సిటీ సాంకేతిక నిర్వహణ మొత్తాన్ని అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నేను స్వీడన్ వెళ్తున్నా...ఇక్కడ రిజిస్ట్రార్, రెక్టార్‌లు చూస్తారు..
స్వీడన్‌లోని బ్లెకినో వర్సిటీతో ఏయూకి ఎంవోయూ ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ మూడేళ్లు చదివిన తర్వాత నాలుగో ఏడాది అక్కడ చదివితే అక్కడి బీఎస్‌ఈ ఇంజనీరింగ్ సర్టిఫికెట్‌తో పాటు ఏయూ నుంచి బీటెక్ డిగ్రీ ఇస్తాం.. డ్యూయల్ డిగ్రీ కోర్సు వల్ల స్వదేశంలోనూ, విదేశాల్లోనూ విరివిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతటి ప్రాధాన్య అంశంపై ఎంవోయూ నేపథ్యంలో నేను స్వీడన్ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తోంది. బుధవారం రాత్రి 9.30గంటల వరకు ఏయూలోనే ఉండి స్వయంగా పరిస్థితిని సమీక్షించాను. నేను స్వీడన్‌కు వెళ్లినప్పుడు ఇక్కడ ఇబ్బంది కాకుండా రిజిస్ట్రార్, రెక్టార్‌లు చూస్తారు.. అని ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ఫ్రొఫెసర్ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధికి చెప్పుకొచ్చారు.
తప్పు దిద్దుకుంటున్నారు
ఆసెట్ సీట్ల కేటాయింపులో జరిగిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీట్ల కేటాయింపులో లోపాలను ఎత్తిచూపుతూ సాక్షి బుధవారం సంచికలో ‘ఆసెట్.. అడ్మిషన్లు ఫట్’ శీర్షికన ప్రచురించిన కథనం వర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. దాంతో అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. విద్యార్థులకు వారి ర్యాంకులు, రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
సీఎంఐకి కట్టబెట్టడం ఏయూ పెద్దల నిర్ణయం
ఏయూ అడ్మిషన్ల ప్రక్రియను బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్‌మెంట్ ఇంటర్నేషనల్‌కు కట్టబెట్టాలన్నది ఏయూ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయమని అడ్మిషన్ విభాగం డైరెక్టర్ వెంకటరావు స్పష్టం చేశారు. ఇందులో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆ విషయంలో తమ పాత్ర ఉందన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. అడ్మిషన్లకు సంబంధించి విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బృందం సీఎంఐకి సహకరిస్తోందని వెంకటరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
–వెంకటరావు, అడ్మిషన్స్ డైరెక్టర్
