సర్వేజన
నీలగిరి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబసర్వేకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా ఎన్యుమరేటర్లకు సర్వేపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీలు మినహా మిగతా అన్నిచోట్ల శిక్షణ పూర్తిచేశారు. గైర్హాజరైన సిబ్బందికి మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సర్వేలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కలిపి మొత్తం 38 వేలమంది పాల్గొనున్నారు. కాగా సర్వేకు సంబంధించిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నెల 16వ తేదీన జిల్లా కేంద్రానికి చేరుతాయి. ఇక్కడి నుంచి తహసీల్దార్లకు వాటిని పంపిణీ చేస్తారు. అనంతరం తహసీల్దార్లు 19వ తేదీ ఉదయం ఎన్యుమరేటర్లకు అందజేస్తారు. దూరప్రాంతాల్లో ఉన్న వారికి 18న సాయంత్రం పత్రాలు అందజేస్తారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లకు మండల కేంద్రం నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. మొత్తం ప్రైవేటు స్కూల్ బస్సులు 354, ఇతర వాహనాలు 482 ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారికి కలెక్టర్ లేఖ రాశారు. ఒక్కో మండలంలో 6 స్కూల్ బస్సులు, 7 నుంచి 10 వరకు ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయనున్నారు.
అర్హత కలిగిన వారికే బాధ్యతలు...
పదోతరగతి ఆపై చదువుకుని అర్హత కలిగిన వారిని మాత్రమే ఎన్యుమరేటర్లుగా నియమించారు. అంగన్‌వాడీ వర్కర్లు, పదో తరగతిలోపు ఉన్న ఎన్యుమరేటర్లకు అసిస్టెంట్లుగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను నియమించారు.
సర్వేపై తొలగని సందేహాలు ..
జిల్లాఅంతటా సర్వేపైనే చర్చ జరుగుతోంది. ప్రజలకు పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలా..? లేదా..! అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారి పరిస్థితి ఏమిటంటే, దానిపై ఎవరి నుంచి సరైన సమాధానం రావడం లేదు. ‘‘చదువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల వివరాలను ఆధారాలతో చూపించాలి. ఇంటికి తాళం వేసి ఉన్నట్లయితే, పొరుగున ఉన్న వ్యక్తుల నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటారు. తాళం వేసి ఉన్న ఇంటి యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తారు. సామాజిక ఆర్థిక సర్వే తరహాలోనే సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహలకూ గురికావద్దు’’ అని అధికారులు అంటున్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఆయా మండలాల్లోని సంబంధిత అధికారులు సంప్రదించాలని, లేదా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు.
టోల్ ఫ్రీ నంబరు
సర్వేలో సందేహాలను నివృత్తి చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు 18004251442 ఏర్పాటు చేశారు. పట్టణాలు/గ్రామాల్లో సమగ్ర సర్వే గురించి ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కలెక్టర్ కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు.