అత్తను చంపి.. భార్యను బెదిరించి...
* నాటు తుపాకీతో పరారైన హంతకుడు
* పోగుళ్లను జల్లెడ పట్టిన పోలీసులు
బేస్తవారిపేట : అత్తను నాటు తుపాకీతో చంపి.. దానితోనే భార్యను బెదిరించి పరారైన వ్యక్తి ఉదంతం ఇది. మండలంలోని పోగుళ్లలో అత్త తిరుమలమ్మ(55)ను అల్లుడు అల్లూరయ్య ఆదివారం రాత్రి తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని గిద్దలూరు సీఐ నిమ్మగడ్డ రామారావు తన సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.
ఎస్సై వి.నాగశ్రీను ఆధ్వర్యంలో తిరుమలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. పోగుళ్లలో నాటు తుపాకీతో హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కాపురం ఓఎస్‌డీ సమైజాన్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్‌పార్టీ పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టారు.
కుమారునికి కొత్త దుస్తులు తేలేదనే..
గ్రామంలో ఆదివారం పోలేరమ్మ జాతరతో పాటు హంతకుడు అల్లూరయ్య కొడుకు పురిటి స్నానం చేయించారు. ఈ సందర్భంగా అల్లూరయ్య పూటుగా మద్యం తాగాడు. తన కొడుకుకు నూతన దుస్తులు తీసుకురాలేదని అత్తింటి వారితో గొడవకు దిగాడు. గొడవ పెద్దదవుతుండటంతో అత్త ఇంటికి ఎదురుగా ఉన్న తన ఇంట్లో అల్లూరయ్యను పెట్టి తాళం వేశారు. అక్కడ దాచి ఉంచిన నాటు తుపాకీతో ఎదురు దబ్బల తలుపు సందులోంచి కాల్చాడు.
అత్త తిరుమలమ్మ కడుపులో తుపాకీ గుండు దిగబడి బయటకు వచ్చింది. ఆమె పక్కనే ఉన్న మనుమడు కళ్యాణ్ చేతులకు గాయాలయ్యా యి. తీవ్రంగా గాయపడిన తిరుమలమ్మను మంచంపై పడుకోబెట్టి రోడ్డుపైకి తీసుకొచ్చేలోపే ఆమె మృతి చెందింది. సంఘటన జరిగిన వెంటనే అల్లూరయ్య తన ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. భార్యాబిడ్డపై గురిపెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి తుపాకీతో సహా పరారయ్యాడు.