► ఎస్పీ విశాల్ గున్నీ అభినందన
► రూ. 5 వేల నగదు బహుమతిగా అందజేత
నెల్లూరు : ఆటోలో మరిచిపోయిన విలువైన ఆభరణాల బ్యాగును ప్రయాణికుడికి అందించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. చింతారెడ్డిపాళెం యల మవారిదిన్నెకు చెందిన ఆటోడ్రైవర్ కాయల రఘును ఎస్పీ విశాల్‌గున్నీ శుక్రవారం అభినందించారు.
రఘు వీఆర్సీ సెంటర్‌లో ఆటో స్టాండ్‌లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గూడూరు ఇందిరానగర్‌కు చెందిన గునపాటి మురహరిరెడ్డి తన పనిమనిషితో కలిసి ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం మినీబైపాస్‌లోని పీటీ రంగరాజన్ పెట్రోల్ బంకు వద్ద బస్సు దిగి చిల్డ్రన్స్‌పార్కు వద్దనున్న పుండరీ కాంక్షయ్య వీధిలోని స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు రఘు ఆటో ఎక్కారు. నాలుగు బ్యాగులను ఆటోలో తన వద్ద పెట్టుకున్న ఆయన నగల బ్యాగును మాత్రం వెనుక పెట్టాడు. స్నేహితుడి ఇంటి వద్ద దిగి తన వద్దనున్న నాలుగు బ్యాగులను తీసుకుని, నగల బ్యాగును పని మనిషి తెస్తుందని భావించి లోనికి వెళ్లాడు. ఆటోడ్రైవర్ వారిని దింపి వెళ్లిపోగా, పని మనిషి ఇంట్లోకి ఖాళీ చేతులతో రావడం గుర్తించిన మురహరిరెడ్డి నగల బ్యాగు ఎక్కడాని ప్రశ్నించాడు. ఆమె నివ్వెరపోవడంతో ఇంట్లో నుంచి పరుగులు తీసి ఆటో కోసం గాలించారు.
జరిగిన విషయాన్ని బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ చెంచురామారావు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాగులో రూ.10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, డైమండ్ రింగ్‌లు, లాప్‌టాప్, సెల్‌ఫోన్, రూ.40 వేల నగదు ఉందని బాధితుడు పేర్కొనడంతో ఆటోడ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. కాగా ప్రయాణికులను దించి కొద్దిదూరం వెళ్లిన రఘు వెనుక బ్యాగు ఉండటాన్ని గమనించి బాధితులకు ఇచ్చేందుకు వెనక్కి వచ్చాడు. గమనించిన బాధితుడు, పోలీసులు ఆటో వద్దకు రాగా బ్యాగు అప్పగించాడు. ఆటోడ్రైవర్, పోలీసుల సమక్షంలో బాధితుడు బ్యాగును తెరచి చూసి అందులో అన్ని వస్తువులు పక్కాగా ఉండటంతో ఆటోడ్రైవర్‌ను అభినందించాడు. నగర డీఎస్పీ వెంకటరాముడి ద్వారా తెలుసుకున్న ఎస్పీ విశాల్‌గున్నీ నిజాయితీ పరుడైన ఆటోడ్రైవర్‌ను తన చాంబర్‌లో అభినందించారు. రఘును సహచర ఆటోడ్రైవర్లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మురహరిరెడ్డి ఆటోడ్రైవర్‌కు ఎస్పీ ద్వారా మీదుగా రూ.5 వేలు నగదును బహూకరించారు.
ఆటోడ్రైవర్ నిజాయితీ
Published Sat, Apr 16 2016 3:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM
Advertisement