
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా అమలు చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రైతులు ఆనందంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో మంత్రి అవంతి రైతు భరోసా కింద చెక్కులు పంపిణీ చేశారు. రూ. 31 కోట్ల సాయాన్ని ఈ పథకం కింద రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న చోడవరం షుగర్ ప్యాక్టరీని ఆదుకుంటామని స్పష్టం చేశారు. కల్యాణపు లోవను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ. 25 లక్షల విడుదల చేస్తామని తెలిపారు. కొమరువొలు-కొండపల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు నిధులు విడుదల చేయనున్నట్టు చెప్పారు. కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మాడుగుల-చోడవరం ప్రాంతాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో కార్యకర్తలను పట్టించుకోకుండా.. తన సామాజిక వర్గానికే మేలు చేసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో వర్షం కురిసిందంటే అది సీఎం వైఎస్ జగన్ మంచితనమేనని వ్యాఖ్యానించారు.