సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వలంటీర్లపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు, వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను టెర్రరిస్ట్‌లంటూ బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ప్రస్తావించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వలంటీర్లపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. టీడీపీ నేతలు వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి: వలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. బొజ్జల సుధీర్‌కు బుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వ్యవస్థ వలంటరీ వ్యవస్థ.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తుందన్నారు.
‘2 లక్షల 50 వేల మంది వలంటీర్లు అంటే ఎవరు, వాళ్లంతా మన ఇంట్లో పిల్లలు, ఇరుగు పొరుగు పిల్లలు కాదా? కేరళ రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఆనాడు పవన్ కల్యాణ్ వలంటరీ వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని పిచ్చి కూతలు కూశాడు. వలంటీర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పుడు తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు.
వలంటీర్లపై విషం
అవ్వతాతాలు గడప దాటకుండా ఒకటో తారీఖున టంచన్‌గా పింఛన్ ఇస్తున్న వాలంటరీలపై కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుదీర్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచినా వాలంటరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్‌తో పోల్చిన బొజ్జల సుదీర్ రెడ్డి అసలు మనిషేనా అని ప్రశ్నించారు. వలంటరీలను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు , పవన్‌లు వలంటరీలపై విషం కక్కి అబాసు పాలయ్యారపి. వంలంటరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్న వీరందరికి త్వరలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు
కృష్ణా జిల్లా: వలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య. చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇళ్లదగ్గర మగవాళ్ళు లేని సమయంలో వలంటీర్లు తలుపులు కొడతారని అన్నడం విన్నామని. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలను వలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికార దాహంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది. 2006 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమ నీరు రైతులకు అందిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత రైతుల అవసరాల కోసం మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. వంశీ రైతులకు మేలు చేస్తుంటే టీడీపీ నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. కావాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుయుక్తులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం.’ అని పేర్కొన్నారు.
కాగా వలంటీర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సేల్స్‌లాగా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ల అంతు చూస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment