సాక్షి, విశాఖపట్నం : కరోనా నియంత్రణ కోసం పనిచేస్తున్న ప్రతీ ఒక్క ఉద్యోగికి మంత్రి అవంతి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్ల ద్వారా అనాథలు, భిక్షాటన చేసేవారికి ఆశ్రయం కల్పించి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌పై వెయ్యి రూపాయిల సాయంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వలస వచ్చిన ఇతర జిల్లాలకి చెందిన 50 వేల కుటుంబాలకి రేషన్ అందించామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్చంద సేవా సంస్ధలు సైతం సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అవంతి తెలిపారు. కరోనా కేసులను దాస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ఎవరు ముందుకు వచ్చినా టెస్టులు చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న అధికార యంత్రాంగాన్ని కనీసం మెచ్చుకునే మనస్సు చంద్రబాబు నాయుడుకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు బాగా పనిచేసినట్లు, మీరు ప్రతిపక్షంలో ఉంటే పనిచేయనట్లు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలని సంఘటితం చేశారని అవంతి అన్నారు. దేశ ప్రజల శ్రేయస్సుని కాంక్షించే నాయకులైన ప్రధాని, సీఎం మనకి ఉన్నారని తెలిపారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు, వైద్య సిబ్బంది నుంచి వైద్యుల వరకు ప్రతీ ఒక్కరూ బాగా పనిచేస్తున్నారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment