సాక్షి, గుంటూరు: గుంటూరులోని తులసి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు బాహుబలి సినిమా చూపిస్తూ వినూత్నంగా సర్జరీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఇంట్రా ఆపరేటివ్ నేవిగేషన్ విధానంతో ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన వేశపోగు వినయకుమారి ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఈ మధ్య ఫిట్స్ రావడంతో గుంటూరు తులసి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి న్యూరాలజీ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారిని సంప్రదించింది. ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించిన డాక్టరు తలలో గడ్డ ఉందని నిర్ధారించి తక్షణమే ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో ఆమెకు ఈ నెల 26న వైద్యుల విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
అయితే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు రోగి మెలుకువగా ఉండటం కోసం వినయకుమారికి ఇష్టమైన బాహుబలి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపించారు. వైద్యులు ఆమెతో మాట్లాడుతూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ వివరాలను ఆస్పత్రి న్యూరోసర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మీడియాకు తెలియజేశారు. రోగి ట్యూమర్ కుడి కాలు, కుడి చేయి నరాలు కలిసి ఉన్నచోట, మెదడులో మాటను వచ్చేలా చేసే ప్రదేశంలో(సెన్సరీ కాటెక్స్ ప్రదేశం) ఉన్నట్లు గుర్తించామన్నారు. సకాలంలో, జాగ్రత్తగా ఆపరేషన్ చేయకపోతే కాలు, చేయి, మాట పడిపోవటం, ఫిట్స్ రావటం వంటి ప్రమాదం ఉండేదన్నారు. సుమారు గంటన్నరసేపు జరిగిన సర్జరీలో తనతోపాటు నలుగురు వైద్యులు పాల్గొన్నారని పేర్కొన్నారు.