సాక్షి, గుంటూరు: గత ఐదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతూ.. నిరంతరం కుడి చేయి కొట్టుకుంటున్న పదేళ్ల బాలుడికి గుంటూరుకు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి అరుదైన శస్త్రచికిత్స చేసి వ్యాధిని నయం చేశారు. ఆపరేషన్ వివరాలను బుధవారం గుంటూరులో ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన బురుసు వీర్రాజు, మహేశ్వరి దంపతుల పదేళ్ల కుమారుడు మహేష్ 2015 నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా ఫిట్స్ తగ్గలేదు.
గత నెల 15 నుంచి రాత్రి నిద్రపోయే 8 గంటలు మినహా రోజంతా బాలుడి కుడిచేయి ఆగకుండా నిరంతరం కొట్టుకుంటూనే ఉండేది. దీంతో బాలుడి తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా.. బ్రిందా న్యూరో సెంటర్‌కు వెళ్లమని రిఫర్ చేశారు. బ్రెయిన్ సర్జరీలకు వాడే అత్యాధునిక వైద్య పరికరం ‘న్యూరో నావిగేషన్ టెక్నాలజీ’, ‘యానిమేటెడ్ త్రీడీ బ్రెయిన్ మ్యాప్’లను ఉపయోగించి బాలుడి బ్రెయిన్‌లోని గడ్డను ఈ నెల 17న డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి తొలగించారు. డాక్టర్ త్రినాథ్ సహకరించారు.
నులి పురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్లే ..
ఆపరేషన్ చేసి తొలగించిన ట్యూమర్‌కు బయాప్సీ పరీక్ష చేయగా ‘న్యూరో సిస్టిసెర్కోసిస్ ఆఫ్ బ్రెయిన్’గా తేలిందని డాక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇది ఒక టేప్‌వార్మ్ (నులిపురుగు) వల్ల వస్తుందన్నారు. పంది మాంసం తినేవారితో పాటు కూరగాయలు, పండ్లు సరిగా కడుక్కోకుండా తినేవారిలో న్యూరో సిస్టిసెర్కోసిస్ ఎగ్స్ ఉండి నులిపురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్ల ఈ సమస్య వస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment