పాము కరవగానే..ఇలా చేయకూడదు | Awareness On Snake Bites And First Aid Tips | Sakshi
Sakshi News home page

ఆదమరిస్తే పాముకాటు..భయపడితే ప్రాణానికి చేటు

Published Tue, Jun 12 2018 1:02 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

Awareness On Snake Bites And First Aid Tips - Sakshi

పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్లే అన్నది అపోహ. అసలు పాము గురించి సరైన సమాచారం లేకపోవడమే  ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం. వాస్తవానికి విష సర్పాల కన్నా విషం లేని, ప్రమాదం కలిగించని పాములే ఎక్కువ. అయితే పాముకాటు గురించి అశ్రద్ధ చేయకుండా తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం మంచిది.  తొలకరి వర్షాలతో భూమిలోని విష పురుగులు బయటకు వస్తుంటాయి. ఎక్కువగా రైతులు, కూలీలు పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అవగాహనే మంత్రంగా.. వైద్యమే సూత్రంగా ప్రత్యేక కథనం.   

కర్నూలు (హాస్పిటల్‌): జిల్లాలో ఈ ఏడాది జూన్‌ నెల ప్రారంభం నుంచే వర్షాలు పలకరించాయి. తొలకరి వర్షాలకు భూమిలో దాగున్న విష సర్పాలు, పురుగులు బయటకు వస్తున్నాయి. ఆదమరిచి ఉన్న వారిని ఇవి కాటేస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాలో పాముకాట్లు, విష పురుగుల కాట్లకు గురై ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారం రోజుల్లోనే కర్నూలు పెద్దాసుపత్రిలో ఐదు విషపురుగు కాటు కేసులు నమోదయ్యాయి. ఇటీవల తరచూ వర్షాలు కరుస్తుండటం, ఈ కారణంగా ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో పొదలు పెరగడంతో విషపురుగుల సంచారం అధికమైంది. ఒక్కోసారి అవి ఇళ్లల్లోకి రావడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొంత మంది విష పురుగులు కాటు వేయగానే నాటు మందును ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. నేరుగా సమీపంలోని ఆసుపత్రికి వెళ్తే మెరుగైన చికిత్స అందుకునే వీలుంది.

విష సర్పం కాటు – లక్షణాలు
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు పాము, కట్ల పాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది. విష సర్పాలు వేర్వేరుగా ఉన్నట్లే వాటి కాటు వల్ల బాధితుల్లో కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్థాయి ఉంటుంది. సాధారణ తాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది. నల్లతాచు (కింగ్‌కోబ్రా) విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది. కట్లపాము కాటు బాధ ఒకరకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. 

కాటు ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది.
నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది.  
పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, చొంగ కారవచ్చు.  
కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు.  

మనిషికి పాము శత్రువు కాదు
పాము మనిషికి శత్రువు కాదు. తన ఆత్మరక్షణ కోసం, విధిలేని పరిస్థితుల్లో మాత్రమే కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.   

పాము కరవగానే..
పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి.   
పక్కనున్న వారు ఆ పాము విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత కచ్చితంగా అందజేయవచ్చు.
నాటు వైద్యం, మంత్రతంత్రాల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని నడిపించకుండా తీసుకెళ్లాలి.   
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటుకు ఉచిత చికిత్స లభిస్తుంది. వైద్యునికి రోగి గురించి సమాచారాన్ని ముందే అందజేస్తే త్వరగా మెరుగైన చికిత్స అందజేసే వీలుంది.   

ఇలా చేయకూడదు
ముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతోపాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయవద్దు. ఒక్కోసారి పాముకాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే     ఉత్తమం.  
మరికొందరు సినిమా హీరోలా పాము కరిచిన ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాముకాటు వేయగానే విషం రక్తంలో ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి హాని కలగవచ్చు.

వైద్యంతో ప్రాణాలు కాపాడవచ్చు
విషం విరుగుడు ఇంజక్షన్‌ రూపంలో త్వరగా పని చేస్తుంది.  
బాధితునికి ఆందోళన, షాక్‌ కారణంగా తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారింవచ్చు.  
సెలైన్‌ రూపంలో శక్తిని ఇస్తూ, చికిత్స మరింత మెరుగై అందించవచ్చు.  
పాముకాటు గాయానికి తగు చికిత్స చేయడం ద్వారా ఇతర ఇబ్బందులు లేకుండా చేయవచ్చు.  
చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్‌ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్భంధు పథకం కింద పరిహారం లభించవచ్చు.  

పాములెక్కడెక్కడ ఉంటాయి
ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే ఎలుకలను, తడిగా ఉండే చోట కప్పలను తినేందుకు పాములు వస్తాయి.  =దుంగలు, కట్టెలు వాటి మధ్యలో పాములు, తేళ్లు ఉండే ప్రమాదం ఉంది.
పిడకల మధ్య  విష పురుగులు చేరతాయి.  
చేలగట్ల వెంబడి నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కిర్రుచెప్పులతో పాము కాటు ప్రమాదం తప్పుతుంది. =ముఖ్యంగా రాత్రిపూట మోటారు వేయడానికి, నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్‌ ఉపయోగించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement