సాక్షి, హైదరాబాద్: బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచార కేసులో ఏడుగురు అనుమానితులకు నార్కో పరీక్షలపై తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాని నిందితులకు నార్కో ఎనాలసిస్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు పునర్‌విచారణలో భాగంగా ప్రధాన నిందితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షకు అనుమతిని విజయవాడలోని ట్రయిల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. నిందితుల అంగీకారం లేకుండా నార్కో టెస్టులను నిర్వహించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరిస్తూ స్థానిక కోర్టు సిట్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనిపై వాదనల అనంతరం హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్. బాలయోగి తన తీర్పును వాయిదా వేశారు. అయితే హాస్టల్ వార్డెన్, ఆమె భర్త మాత్రమే ఈ పరీక్షలకు అంగీకరించగా, మిగిలిన వారు నిరాకరించారు.
ఆయేషా మీరా హత్య కేసులోప్రధాన నిందితులు కోనేరు సతీష్ బాబు(కాంగ్రెస్ మాజీమంత్రి కోనేరు రంగారావు మనవడు) అబ్బురి గణేష్, చింతా పవన్‌కుమార్‌తోపాటు, హాస్టల్ వార్డెన్ ఐనంపూడి పద్మ, ఆమె భర్త శివ రామకృష్ణ, ఆయేషా రూం మేట్స్, సౌమ్య, కవితకు ఈ పరీక్షలు నిర్వహించాలని ఎస్ఐటీ పేర్కొంది. నార్కో ఎనాలలిసిస్, బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేటింగ్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ టెస్ట్ (BEOSP) నిర్వహించాలని కోరింది. అలాగే ఈ ఫలితాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (FSL) కు పంపించాలని కోరింది.
మరోవైపు ఆయేషా హత్య కేసులో సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపిస్తూ ఆయేషా తల్లిదండ్రులు గత నెలలో మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడితో నేరస్తులను కాపాడేందుకు తమ కూతురి బట్టలు, ఇతర సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపించారు.
కాగా 2007, డిసెంబరు 27న ఆయేషా మీరా (17) విజయవాడ ఇబ్రహీంపట్నంలోని లేడీస్ హాస్టల్‌లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణల ఎదుర్కొన్న సత్యం బాబుకు 2010లో విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే 2017, ఏప్రిల్‌లో సత్యంబాబును హైదరాబాద్ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంతోపాటు, కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని ఆదేశించింది. దీంతో కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment